TG: నిత్యావసర సరుకైన బియ్యం అమ్మకాల్లో అక్రమాలకు తెరలేపి, సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్న కేటుగాళ్ల గుట్టు రట్టయింది. కంపెనీలు ముద్రించిన అసలు ఎంఆర్పీ ధరలను గోల్మాల్ చేసి, అధిక రేట్లతో కూడిన నకిలీ స్టిక్కర్లు అతికిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు తనిఖీల్లో ఈ దారుణ మోసం వెలుగుచూసింది. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన 11 మంది వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
కంపెనీ స్టిక్కర్లు పీకేసి.. కొత్త రేట్లతో దగా
పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో అధికారులు హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాపారులు వినియోగదారులను దోచుకుంటున్న తీరు చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు. బియ్యం మిల్లులు, బ్రాండెడ్ కంపెనీలు బస్తాలపై ముద్రించిన అసలు ధరను చెరిపేయడం లేదా తొలగించడం చేస్తున్నారు. వాటి స్థానంలో భారీగా పెంచిన రేట్లతో ముద్రించిన కొత్త స్టిక్కర్లను అతికించి అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. 25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోలుగా ముద్రించిన లేబుళ్లను అంటించి, తూకంలో సైతం వినియోగదారుల కళ్లకు గంతలు కడుతున్నారు. ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, కార్మిక శాఖ అనుమతులు, కనీసం ఆహార భద్రతా ప్రమాణాల ధ్రువీకరణ పత్రాలు కూడా లేకుండానే ఈ అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు తేలింది. పేదలకు పంపిణీ చేసే పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వ్యవహారాలనూ టాస్క్ఫోర్స్ రట్టు చేసింది.
11 మందిపై ఎఫ్ఐఆర్లు..
ఈ అక్రమాలపై కఠినంగా స్పందించిన అధికారులు సరూర్నగర్, జీడిమెట్ల, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. నిందితులపై నిత్యావసర వస్తువుల చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే వ్యాపారులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. బియ్యం ధరల్లో కృత్రిమ కొరత సృష్టించినా, ఎంఆర్పీ కంటే ఎక్కువకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.


