TG: తెలంగాణలో దశాబ్దాలుగా రైతులను, సామాన్య ప్రజలను కలవరపెడుతున్న అటవీ, రెవెన్యూ భూ సరిహద్దు వివాదాలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో నలుగుతున్న ఈ సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో నిర్వహించే జాయింట్ సర్వే ప్రక్రియను తానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తానని మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ, అటవీ శాఖలు, సర్వే అండ్ సెటిల్మెంట్ అధికారులతో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి మాట్లాడారు.
ఒకరిపై ఒకరు నెట్టేస్తే కుదరదు.. నేనే చూసుకుంటా
సరిహద్దు సమస్యలు ఎదురైనప్పుడు అధికారులు ఒక శాఖపై మరొక శాఖ నెపాన్ని నెట్టేస్తూ బాధ్యత నుంచి తప్పుకునే ధోరణిని ఇక ఏమాత్రం సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. రెవెన్యూ - ఫారెస్ట్ భూముల జాయింట్ సర్వే ఎలా జరుగుతోంది, ఎక్కడ వివాదాలు వస్తున్నాయి అనే పురోగతిని తానే స్వయంగా దగ్గరుండి మానిటర్ చేస్తానని తేల్చిచెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రెండు శాఖల అధికారులతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని.. స్థానికంగా తేలే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి, పాలసీ పరమైన అంశాలను మాత్రమే రాష్ట్ర స్థాయికి నివేదించాలని ఆదేశించారు. పాత రికార్డులు, మ్యాపులను క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులతో శాస్త్రీయంగా సరిపోల్చాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వివాదాలకు తావులేకుండా శాశ్వత హద్దులు ఖరారు చేయాలని సూచించారు.
ఆ మూడు జిల్లాల్లో రైతులకు ఊరట
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువ మొత్తంలో ఉండటంతో పాటు, దశాబ్దాలుగా ఫారెస్ట్ - రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల నిత్యం రైతులు, పట్టాదారులే తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం "భూ వివాదాలు లేని తెలంగాణ" నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తోందని, ఈ క్రమంలో ఏ ఒక్క రైతు నష్టపోకుండా పారదర్శకంగా హద్దులు నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి పట్టుదలతో పనిచేయాలని ఆదేశిస్తూ, క్షేత్రస్థాయిలో రైతులు కూడా ఈ సర్వేకు పూర్తి సహకారం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సర్వే & సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పీసీసీఎఫ్ వినయ్ కుమార్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


