ఏపీ

Murasu: దూసుకొస్తున్న 'మురసు' తుపాన్.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

Murasu: అర్నబ్ తుపాన్ సృష్టించిన విధ్వంసాన్ని మర్చిపోకముందే బంగాళాఖాతం మరోసారి అల్లకల్లోలంగా మారింది. సముద్ర గర్భంలో బలపడిన ‘మురసు’ తీవ్ర తుపాన్ ఇప్పుడు కోస్తా తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది.

Murasu: అర్నబ్ తుపాన్ సృష్టించిన విధ్వంసాన్ని మర్చిపోకముందే బంగాళాఖాతం మరోసారి అల్లకల్లోలంగా మారింది. సముద్ర గర్భంలో బలపడిన ‘మురసు’ తీవ్ర తుపాన్ ఇప్పుడు కోస్తా తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతూ దక్షిణ కోస్తా వైపు నేరుగా గురిపెట్టింది. ప్రస్తుతం చెన్నైకి 200 కిలోమీటర్లు, నెల్లూరుకు 210, కావలికి 220, ఒంగోలుకు 260, మచిలీపట్నానికి 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తీవ్ర తుపాన్.. రానున్న కొన్ని గంటల్లో మరింత ప్రమాదకరంగా మారబోతోంది. సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంగోలు పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు..

ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజామున 4 గంటల మధ్య సమయం కోస్తా ప్రజలకు అత్యంత గండంగా మారనుంది. తుపాన్ తీరాన్ని సమీపించే కొద్దీ తీరం వెంబడి గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్ఠంగా ఏకంగా 120 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ స్థాయి పెనుగాలులు విరుచుకుపడితే భారీ చెట్టు సైతం వేర్లతో సహా పెకిలించుకుపోవడం, కరెంట్ స్తంభాలు నేలకూలడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అరటి, బొప్పాయి, ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్.. కుండపోత తప్పదా?

తీవ్ర తుపాన్ కన్ను నేరుగా దక్షిణ కోస్తాపైనే పడటంతో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, అల్లూరి, యానాం, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి.

ఇప్పటికే కాకినాడ తీర ప్రాంతంలో వాన మొదలవ్వగా, మిగతా జిల్లాలన్నీ దట్టమైన మేఘాలతో చీకటిమయంగా మారాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం ఇప్పటికే ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించింది. అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్‌లను తెరిచి క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని యుద్ధప్రాతిపదికన సన్నద్ధం చేసింది.

తెలంగాణపైనా పెను ప్రభావం..

మురసు తీవ్రత కేవలం ఏపీకే పరిమితం కాలేదు. తుపాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వానలు దంచికొట్టనున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. అటు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిసరాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురవనున్నాయి.

రాత్రి పూట తీరం దాటనుండటంతో లోతట్టు, తీరప్రాంత ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ గాలుల దృష్ట్యా బలహీనమైన పైకప్పులు, భారీ చెట్లు, విద్యుత్ లైన్ల కింద నిలబడొద్దని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే 12 గంటలు రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకంగా మారనున్నాయి.

#Murasu Cyclone#Murasu Cyclone Alert#Andhra Pradesh Weather#Telangana Weather#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి