తెలంగాణ

క్లీన్, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్- సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

రచన: NK•••5 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరాన్ని క్లీన్ సిటీగా, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.

* చెత్త సేకరణపై నిర్లక్ష్యం వహించొద్దు

* అవసరానికి అనుగుణంగా గ్రీన్ ట్యాంకర్లు

* ట్రాఫిక్ క్రమబద్దీకరపై ప్రత్యేక దృష్టి పెట్టండి

* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Cm Revanth: హైదరాబాద్ మహానగరాన్ని క్లీన్ సిటీగా, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్త సేకరణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు.

ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ

ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపల్ పరిధిలోని వివిధ ఇండస్ట్రియల్ ఏరియాల్లో చెత్త సేకరణకు ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణకు శుద్ధి చేసిన నీరు

నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్‌ స్కేపింగ్‌, గార్డెనింగ్‌ తో పాటు ఇతర పనులకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ఉద్దేశంతో గ్రీన్ ట్యాంకర్స్ ను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారుకు సూచించారు. నిర్మాణ రంగం, గ్రీనరీ మెయింటెనెన్స్, పార్కుల అభివృద్ధి వంటి అవసరాలకు తాగునీటిని ఉపయోగిస్తున్నారని, దీనికి బదులుగా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ద్వారా తాగునీటిని ఆదా చేయవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.

అందుకే జల మండలి తొలి విడతలో 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో గ్రీన్ వాటర్ సరఫరాను మరింత విస్తరించాలని సీఎం సూచించారు.

ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు

నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టి ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకురావడానికి అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

సాధ్యమైనంత వరకు సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు.

#Cm Revanth#Telangana#Hyderabad#Clean City#Traffic Free City#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి