Chemical Mafia: నల్లగొండ జిల్లాలో ప్రమాదకరమైన వ్యర్ధ రసాయనాల మాఫియా రెచ్చిపోతోంది. కెమికల్ కంపెనీల నుంచి వ్యర్ధ రసాయనాలను ట్రీట్ మెంట్ ప్లాంట్లకు తరలించకుండా నిబంధనలకు విరుద్ధంగా యధేచ్చగా ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కంపెనీ నుంచి రసాయనాల ట్యాంకర్ బయలుదేరిన దగ్గర నుంచి ట్రీట్ మెంట్ ప్లాంట్ వరకు పొల్యూషన్ బోర్డు అధికారులు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. కానీ, పీసీబీ అధికారులు అదేమీ పట్టించుకోవడం లేదు.
నాగార్జునసాగర్ లోలెవల్ కాలువలో వ్యర్థ రసాయనాలు పారబోత
ఇంతకాలం హైదరాబాద్-విజయవాడ NH 65 వెంట, చెరువులు, కుంటల్లో ప్రమాదకరమైన వ్యర్ధ రసాయనాలను మాఫియా పారబోసింది. ఇప్పుడు మరింత బరితెగించింది. ఏకంగా కాలువల్లో పారబోస్తున్నారు. నాగార్జునసాగర్ లోలెవల్ కాలువలో ప్రమాదకర రసాయనాలు కలకలం రేపాయి. పెద్దవూర మండలం చింతపల్లి సమీపంలో విష రసాయనాలను కాలువలోకి పారబోశారు. దీంతో నీళ్లు రంగు మారి ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది గమనించిన స్థానికులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నీరు విషతుల్యం అయ్యే ప్రమాదం
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాలువలోని నీరు విషతుల్యం అయ్యే ప్రమాదం ఉందని.. హానికారక రసాయనాలు కాలువలో పారబోసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పీసీబీ అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మామూళ్ల వసూళ్లలో ఉన్న శ్రద్ధ వారికి ప్రజల ఆరోగ్యం కాపాడటంలో లేదని పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


