Bollywood: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రవిబాబు ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన తొలిసారి హిందీలో ఓ హారర్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాను టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి నిర్మించబోతున్నారు. 'స్కేరీ పిక్చర్స్' అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ సినిమా ప్రకటించగా.ఇప్పుడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలలో చర్చ మొదలైంది.
ఈ అక్టోబర్ 31న న్యూఢిల్లీలో జరిగిన హారర్‌కాన్ ఇండియా 2026 కార్యక్రమంలో రానా దగ్గుబాటి ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. హాలోవీన్ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో తన తదుపరి నిర్మాణ ప్రాజెక్ట్ గురించి వెల్లడించారు. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ హారర్ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వీడియోను కంగనా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
తెలుగులో రవిబాబు తెరకెక్కించిన అనసూయ, అమరావతి, నచ్చావులే, నువ్విలా, లడ్డుబాబు, పందిపిల్ల లాంటి సినిమాలు చాలావరకు విభిన్నమైన కథాంశాలతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ జానర్లలో ఆయన చేసిన ప్రయోగాలు ప్రత్యేకంగా నిలిచాయి. దర్శకుడిగా.. అవును, నచ్చావులే, అనసూయ, అమరావతి, అవును 2, అదుగో వంటి సినిమాలతో రవిబాబు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.
అయితే, ఇప్పుడు అదే ప్రయోగాత్మక ఆలోచనలను హిందీ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు రవిబాబు. 'స్కేరీ పిక్చర్స్' రవిబాబు కెరీర్‌లో తొలి హిందీ ఫీచర్ ఫిల్మ్ కానుండటం విశేషం. దీంతో ఈ సినిమా ఆయనకు దర్శకుడిగా మరో కొత్త ప్రయాణం కానుంది. ఇప్పటి వరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలలో సెకండాఫ్ సరిగ్గా డీల్ చేయలేకపోతున్నాడనే కామెంట్స్ ఉన్నాయి. మరి, ఈ సినిమాతో బాలీవుడ్‌లో ఎంటరవుతున్న ఆయన అక్కడ ఎలాంటి పేరు తెచ్చుకుంటారో చూడాలి.


