AP : రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో కిరాతక దాడికి పాల్పడిన ఉన్మాది కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఆదివారం ఆత్మకూరు అడవుల్లో జరిగిన పోలీస్ ఫైరింగ్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పట్టుకునే క్రమంలో నిందితుడు సీఐపై కత్తితో దాడి చేయబోయాడని, ఆత్మరక్షణ కోసమే ఆరు రౌండ్ల కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఈ మొత్తం ఘటన వెనుక అసలు వాస్తవాలేంటి? ఇది సాధారణ అరెస్ట్ ఆపరేషనా లేక తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘దిశ’ తరహా యాక్షనా అన్న అనుమానాలు ప్రజల్లో, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
కాళ్లు తీసేసే ఛాన్స్ .. విషమంగా ఆరోగ్యం
పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడిని అనంతపురం జీజీహెచ్‌కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైద్యుల వివరాల ప్రకారం.. నిందితుడి కాళ్లలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లగా, ముఖానికి కూడా బలమైన గాయాలయ్యాయి. విపరీతమైన రక్తస్రావం కావడంతో నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించి, ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉంచారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతడి కాళ్లు తొలగించాల్సి రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన పాఠశాల విద్యార్థిని బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చావుబతుకుల మధ్య పోరాడుతోంది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం.. అసలేం జరిగింది?
ఆత్మకూరు అడవుల్లో జరిగిన కాల్పుల తీరుపై నెట్టింట భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. నిందితుడిని రెండు రోజుల క్రితమే పోలీసులు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారంటూ శనివారం నుంచే సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. అదే నిజమైతే, ఆదివారం ఉన్నట్టుండి ఆత్మకూరు అడవుల్లో అతడిని వెతికి పట్టుకోవడం ఏంటనేది ప్రధాన ప్రశ్న. ఒక మారుమూల అడవిలో దాక్కుని, ప్రాణభయంతో వణికిపోతున్న నిందితుడు.. సాయుధులైన పోలీసు అధికారులను చూడగానే కత్తితో తిరగబడేంత సాహసం చేశాడా అన్నది మింగుడుపడని అంశంగా కనిపిస్తుంది.
దిశ ఎన్కౌంటర్ రిపీటా?:
గతంలో హైదరాబాద్‌లో దిశ కేసులో నిందితులను సీన్ రీక్రియేషన్ కోసమని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసిన తరహాలోనే.. ఇక్కడ కూడా బాలికపై జరిగిన కిరాతకానికి ప్రజల్లో రగిలిన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పోలీసులు అలాంటి స్క్రిప్ట్‌నే అమలు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజంగా ఎన్కౌంటర్ చేయాలనే ఉద్దేశం ఉందా?
ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న న్యాయ, క్రైమ్ విశ్లేషకులు మరో కోణాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ పోలీసుల అసలు ఉద్దేశం ఎన్కౌంటర్ చేయడమే అయితే కాల్పులు నేరుగా ఛాతీపై జరిపేవారని, కానీ ఇక్కడ కేవలం కాళ్లపై మాత్రమే కాల్పులు జరపడాన్ని బట్టి చూస్తే ప్రాణాలు తీయాలనే ఆలోచన పోలీసులకు లేదని స్పష్టమవుతోందని అంటున్నారు. నిందితుడు తిరగబడినప్పుడు పూర్తిగా ఆత్మరక్షణ కోసమే పరిమిత కాల్పులు జరిపి, కాళ్లపై గురిపెట్టినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.
స్పృహలోకి వస్తేనే ..
ఆత్మకూరు అడవుల్లో జరిగిన సీన్ ఏంటి? నిందితుడు పోలీసులను ఎదిరించాడా లేక ఏదైనా ముందస్తు ప్లాన్ ప్రకారం ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయా? అనే సస్పెన్స్‌కు తెరపడాలంటే నిందితుడి ఇచ్చే వాంగ్మూలం కీలకంగా మారింది. ప్రస్తుతం అనంతపురం ఆసుపత్రిలో అతడు మృత్యువుతో పోరాడుతున్నాడు. అతడు కోలుకుని స్పృహలోకి వస్తాడా, లేక ఈ కాల్పుల మిస్టరీ చిక్కుముడిగానే మిగిలిపోతుందా అనేది రాబోయే కొద్ది గంటల్లో తేలనుంది.


