తెలంగాణ

నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలా కొట్లాడుతున్నా: రాజగోపాల్ రెడ్డి

రచన: Mamatha puppala•••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వం, అగ్రనేతల పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో తీవ్ర వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వం, అగ్రనేతల పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో తీవ్ర వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానేమీ ప్రతిపక్ష ఎమ్మెల్యేను కాకపోయినా, స్వపక్షంలో ఉంటూ కూడా నియోజకవర్గ నిధుల కోసం ప్రతిపక్ష నాయకుడిలా ప్రభుత్వంతో నిత్యం కొట్లాడాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

 ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలో లంచగొండితనం పెరిగిపోయిందని రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దిగువ స్థాయి పంచాయతీ కార్యదర్శి నుంచి సెక్రటేరియట్‌లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) వరకు డబ్బులు ఇస్తే తప్ప ఏ ఒక్క ఫైలు ముందుకు కదలడం లేదని సంచలన విమర్శలు చేశారు. సారా/బెల్టు షాపులను నిర్మూలిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని అడ్డుకోలేకపోతోందని ధ్వజమెత్తారు. వ్యవస్థలు మారినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల వైఖరిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని, అయినప్పటికీ ఓపిక పట్టి తన మనసును చంపుకుని మరీ నిధుల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు, అభివృద్ధి పనులకు నిధులు తేలేనప్పుడు శాసనసభ్యుడిగా కొనసాగడం దండగేనని పరోక్ష రాజీనామా వ్యాఖ్యలు చేశారు.

 రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాల గురించి ఊళ్లల్లో ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నామని ఆయన తెలిపారు. ‘హామీ ఇచ్చిన నాయకుడు బాగానే ఉన్నాడు.. కానీ రైతులకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా చురకలంటించారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీశాయి.

#KomatireddyRajagopalReddy#MunugodeMLA#TelanganaCongressControversy#RevanthReddyVsRajagopal#BhattiVikramarka#TelanganaPoliticsTelugu#TelanganaNewsTelugu#HydNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి