దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు వసూలు చేసే వైద్య సేవల రుసుములపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆస్పత్రుల్లో అందించే ప్రతి చికిత్స, వైద్య పరీక్షలు, ఇతర సేవల చార్జీలను అందరికీ స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్య రవాణా, చికిత్స వ్యయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా కేంద్రం సోమవారం ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక లేఖ రాశారు. ఆస్పత్రుల్లో రేట్ల పట్టికల ప్రదర్శన సరిగ్గా అమలవుతోందో లేదో తక్షణమే సమీక్షించాలని, రోగులకు, వారి బంధువులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరాలు ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చికిత్స ఖర్చులపై ముందే స్పష్టత ఉండటం వల్ల బాధితులు ఆర్థికంగా ప్రణాళిక వేసుకోవడానికి వీలవుతుందని, బిల్లుల చెల్లింపు సమయంలో ఆసుపత్రుల యాజమాన్యాలతో తలెత్తే అనవసర వివాదాలను అరికట్టవచ్చని కేంద్రం అభిప్రాయపడింది.
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం-2010 ప్రకారం ఆస్పత్రులు తమ వద్ద ఉన్న అన్ని సేవల చార్జీల వివరాలను ఇంగ్లీషుతో పాటు స్థానిక ప్రాంతీయ భాషల్లో కూడా ప్రముఖంగా ప్రదర్శించడం తప్పనిసరి. కేంద్ర చట్టం వర్తించని రాష్ట్రాలు సైతం తమ సొంత రాష్ట్ర చట్టాల ప్రకారం ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆరోగ్యం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి, క్షేత్రస్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ నిబంధనలు పాటించేలా చూడాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని కేంద్రం గుర్తుచేసింది.
మరోవైపు విదేశాల నుంచి భారత్‌కు చికిత్స కోసం వచ్చే రోగుల విషయంలోనూ పారదర్శకత పాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మెడికల్ వీసాలపై వచ్చే విదేశీయులకు అందించే ప్రత్యేక ప్యాకేజీ రేట్లను సైతం ముందుగానే ప్రదర్శించేలా ఆసుపత్రులను ప్రోత్సహించాలని కోరారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతీయ వైద్య రంగ విశ్వసనీయతను మరింత పెంచుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై సామాన్య ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


