తెలంగాణ

Congress vs BRS: అసెంబ్లీ తర్వాత దూకుడు పెంచిన కాంగ్రెస్.. డిఫెన్స్‌లో గులాబీ దళం!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

Congress vs BRS: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ముగింపుతో రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌పై రాజకీయంగా పైచేయి సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. అసెంబ్లీ వేదికగా మొదలైన రగడను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో హస్తం పార్టీ పూర్తి దూకుడు కనబరుస్తుండగా, ఊహించని ఈ రాజకీయ ఎదురుదాడితో గులాబీ దళం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయినట్లు కనిపిస్తోంది.

Congress vs BRS: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ముగింపుతో రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌పై రాజకీయంగా పైచేయి సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. అసెంబ్లీ వేదికగా మొదలైన రగడను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో హస్తం పార్టీ పూర్తి దూకుడు కనబరుస్తుండగా, ఊహించని ఈ రాజకీయ ఎదురుదాడితో గులాబీ దళం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయినట్లు కనిపిస్తోంది.

జాతీయ అంశాలపై గులాబీ నేతల సైలెన్స్..

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వైఖరి, ఎస్ఐఆర్ వివాదంపై దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలన్నీ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటే, బీఆర్‌ఎస్ అధిష్ఠానం మాత్రం వ్యూహాత్మక మౌనం దాల్చడం కాంగ్రెస్‌కు బలమైన అస్త్రంగా మారింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వంటి అగ్రనేతలు ఎస్ఐఆర్‌పై స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఎండగడుతోంది. బీజేపీపై గళమెత్తితే ఎక్కడ కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంటుందో, ఫార్ములా-ఈ రేస్ వివాదంలో అరెస్టుల పర్వం మొదలవుతుందోనన్న భయంతోనే గులాబీ దళం నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేతలు నేరుగా దాడికి దిగుతున్నారు. జాతీయ స్థాయిలో కాషాయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేని స్థితిలో బీఆర్‌ఎస్ పడిపోయిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికార పక్షం దూసుకుపోతోంది.

గులాబీ కోటకు కాంగ్రెస్ బీటలు

గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోని అవినీతి ఆరోపణలు, నేతల ఆస్తులు, ఫార్మ్‌హౌస్‌ల వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలు, స్పీకర్‌పై అనుచిత కామెంట్స్ వివాదాన్ని కాంగ్రెస్ రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకుంది. దళిత సంఘాలతో కలిసి కేసీఆర్ ఫార్మ్‌హౌస్ ముట్టడికి పిలుపునివ్వడం, అనంతరం ఫార్మ్‌హౌస్‌ను పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనతో బీఆర్‌ఎస్‌ను గట్టిగా ఇరుకున పెట్టింది. ప్రతిపక్షం ఎదురుదాడి చేసే అవకాశం లేకుండా వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

కౌశిక్ రెడ్డిపై వేటు తప్పదా?

మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం కూడా అధికార పక్షానికి మరింత రాజకీయ బలాన్నిచ్చింది. అసెంబ్లీలో ఆయన ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ఎథిక్స్ కమిటీ స్పీకర్‌కు నివేదిక సమర్పించిన నేపథ్యంలో, ఆ చర్యల అంశం ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు మరో తలనొప్పిగా మారింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ గులాబీ శిబిరంలో ఆందోళన రేపుతోంది. ఒకవైపు అవినీతి కేసులు, దర్యాప్తు సంస్థల భయాలు.. మరోవైపు ఫార్మ్‌హౌస్ వివాదాలు, ఎథిక్స్ కమిటీ విచారణలతో బీఆర్‌ఎస్ డిఫెన్స్‌లో పడగా, వచ్చిన ప్రతి అవకాశాన్ని రాజకీయ ఆయుధంగా మలుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని దూకుడును ప్రదర్శిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#Congress vs BRS#Telangana Congress#BRS#Bharat Rashtra Samithi#Telangana Politics#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి