కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలోని సుమారు 200మంది ఉన్నతాధికారులు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ (CBI)తో పాటు విదేశాంగ శాఖకు చెందిన అధికారులు కూడా ఉన్నారని, వారే ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని తమకు అందిస్తున్నారని వెల్లడించారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు వైపు ఇండీ (INDIA) కూటమి చేపట్టిన భారీ నిరసన మార్చ్‌కు ముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తనకు నిరంతరం సందేశాలు పంపిస్తున్నారని రాహుల్ గాంధీ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘మీరు చేసిన తప్పును అంగీకరించి అప్రూవర్‌గా మారండి.. మీరు అసలు నేరస్థుడు కాదు, మీ వెనుక అసలు సూత్రధారులు ఉన్నారు’ అని సీఈసీకి సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీలు తెస్తున్న తీవ్రమైన ఒత్తిడి వల్లే సీఈసీ అలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే తనకు వచ్చిన సందేశాల వివరాలను, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికతను కాపాడటంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఇండీ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆగదని రాహుల్ తేల్చిచెప్పారు. ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విపక్ష నేతలందరితో కలిసి సుప్రీంకోర్టు వైపు శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తమతో కలిసి పోరాడే ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి తాము భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాశామని, ఈ అంశంపై పిటిషన్ దాఖలు చేయాలని సీజేఐ సూచించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. సీఈసీ తొలగింపు తర్వాత ప్రధాని మోదీ, అమిత్ షాల ప్రజావ్యతిరేక విధానాలపై తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ వేదికగా విపక్షాలు నిర్వహించిన ఈ నిరసన మార్చ్, రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలు దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని తీవ్రంగా వేడెక్కించాయి.


