దేశ రాజకీయాల్లోకి రాహుల్ గాంధీ అడుగుపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు నాయకుడిగా, గాంధీ కుటుంబ రాజకీయ వారసుడిగా ఆయనను ముందుకు తీసుకురావడం మొదలైంది. ఈ నేపథ్యంలో కుటుంబ వారసత్వంతో వచ్చిన ఈ అవకాశం దేశాన్ని నడిపించే స్థాయికి రాహుల్ ను తీసుకెళ్లగలదా అనే చర్చలు కాంగ్రెస్ పార్టీ వర్గీయుల్లో మొదలైయ్యాయి.. ఎందుకంటే పార్టీ పదవులు చేపట్టడం వేరు.. ప్రజల విశ్వాసాన్ని సంపాదించి, దేశవ్యాప్తంగా నాయకత్వాన్ని నిరూపించుకోవడం వేరు..
ఈ సందిగ్ధంలో రాహుల్ గాంధీ 2004 లోక్‌సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో తీవ్రంగా బలహీనపడింది. అప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్న పార్టీ కేవలం పది స్థానాలకే పరిమితమైంది. అలాంటి పరిస్థితుల్లో గాంధీ కుటుంబానికి చెందిన యువ నాయకుడిగా రాహుల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం కాంగ్రెస్‌కు సవాల్ తో కూడిన ఆశగా కనిపించింది..
ఆ సమయంలో ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొందరు రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ రాజకీయ వారసురాలిగా బలంగా నిలబడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. కానీ సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీకి రాజకీయంగా కీలకమైన బాధ్యతలు అప్పగిస్తూ ముందుకు తీసుకెళ్లారు. మరోవైపు సోనియా గాంధీ 2006లో తిరిగి రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో రాహుల్, ప్రియాంక కలిసి ప్రచారం నిర్వహించారు.
అలాగే రాహుల్ సైతం 2007 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం అదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఆయనకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలతో పాటు.. 2008లో యువజన కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు. తర్వాత 2013 జనవరిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇలా కొద్ది సంవత్సరాల్లోనే పార్టీ అత్యున్నత నాయకత్వానికి దగ్గరయ్యారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఎదుగుదలపై ప్రతిపక్షాల నుంచే కాకుండా రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా పలు ప్రశ్నలు వినిపించాయి. రాహుల్ కాబట్టే పదవులు సులువుగా వరించాని.. ఇక్కడ గాంధీ కుటుంబ వారసత్వం ప్రభావం స్పష్టంగా కనిపించిందనే చర్చలు కాంగ్రెస్ వర్గీయుల్లో మొదలైనట్టు ప్రచారం జరిగింది. కుటుంబ నేపథ్యం లేకుండా పార్టీలో ఆ స్థాయిలో ఎదగడం అంటే చాలా కష్టమనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి..
మరోవైపు రాహుల్ గాంధీని భవిష్యత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకురావాలనే చర్చ 2012లో కాంగ్రెస్‌లో బలపడింది. సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ ఈ అంశంపై మాట్లాడగా, సల్మాన్ ఖుర్షీద్ వంటి నేతలు కూడా రాహుల్ నాయకత్వ సామర్థ్యాన్ని సమర్థించారు. 2014 ఎన్నికలకు ముందు ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌లో చర్చకు వచ్చింది.
కానీ ఒక నాయకుడిని ప్రధానమంత్రి పదవికి సిద్ధం చేయడం అంటే పార్టీ పదవులు అప్పగించినంత సులువు కాదనే విషయం చర్చలోకి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, పేదరికం, అంతర్గత భద్రత, విదేశాంగ విధానం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహనతో పాటు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా నిరూపించుకోవలసిన అవసరం ఉంటుంది. ఆ సమయంలో రాహుల్ గాంధీకి అలాంటి జాతీయ నాయకత్వ అనుభవం ఎంతవరకు ఉందన్నచర్చ ప్రధాన అంశంగా తలెత్తింది.
మరోవైపు యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన మంత్రివర్గంలో చేరలేదు. యువజన కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు, పార్టీ కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలపైనే ఆయన దృష్టి పెట్టారు. ఇలా ఆయన తీరును కొందరు తప్పుపట్టగా.. మరికొందరు సమర్థించారు.. ప్రత్యక్ష ప్రభుత్వ పాలనలో అనుభవం సంపాదించకుండా పెద్ద పదవులు చేపట్టకపోవడం మంచిదే అనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అలాగే ఆయన నాయకత్వ పరిమితి అంతే ఉందనే విమర్శలు చేశారు.
ఇక్కడ రాహుల్ గాంధీ రాజకీయ ప్రయాణంలో రెండు భిన్నమైన అభిప్రాయాలు కనిపిస్తాయి. ఒకవైపు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, పార్టీ సంస్థాగత వ్యవస్థను మార్చడం వంటి ప్రయత్నాలు ఉంటే, మరోవైపు ప్రభుత్వ నిర్వహణలో ప్రత్యక్ష అనుభవం లేకపోవడం, పార్టీకి ఎన్నికల విజయాలు అందించడంలో విఫలం అవడం పై విమర్శలు ఉన్నాయి.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానంపై గాంధీ కుటుంబాన్ని చుట్టుముట్టిన వివాదాలు కూడా ప్రభావం చూపించాయని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా స్విస్ బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో నిధులున్నాయనే ఆరోపణలు గతంలో ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విమర్శలు కేవలం కుటుంబ రాజకీయాలకే పరిమితం కాలేదు. ప్రజలతో ఆయనకు ఉన్న సంబంధాలు, పార్టీ కార్యకర్తలతో సమన్వయం, ఎన్నికల సమయంలో ప్రచార వ్యూహాలు, పార్టీని విజయపథంలో నడిపించే సామర్థ్యం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ విధానాలపై ఆయన ప్రభావం ఎంతవరకు ఉందన్న ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇక ఒక నాయకుడి రాజకీయ జీవితాన్ని కొన్ని ప్రసంగాలు లేదా ఒకటి రెండు ఎన్నికల ఫలితాల ఆధారంగా మాత్రమే అంచనా వేయడం సరైంది కాదని, ఎన్నికల విజయాలు, పరాజయాలు, పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై స్పందన, పార్లమెంటులో పాత్ర, ప్రభుత్వాన్ని ప్రశ్నించే సామర్థ్యం.. ఇవన్నీ పరిశీలించాకే నాయకత్వాన్ని అంచనా వేయాలని రాహుల్ గాంధీ ని అభిమానించే వారు ఆ సమయంలో సూచించారు..
ఇక్కడ కుటుంబ వారసత్వం మరో కీలకమైన అంశంగా మారింది.. అయితే దేశ రాజకీయాల్లో కుటుంబ నేపథ్యం ఉన్న నాయకులు చాలా పార్టీల్లో కనిపిస్తారు. వారసత్వం అనేది కేవలం రాజకీయ ప్రవేశానికి మార్గం సుగమం చేయవచ్చు కానీ, దీర్ఘకాలిక ప్రజా మద్దతుకు అది ఒక్కటే సరిపోదు. ప్రజలు చివరకు నాయకుడి పనితీరు, విశ్వసనీయత, నిర్ణయాలు, తమ సమస్యలపై ఆయన స్పందించే తీరును బట్టి తీర్పు ఇస్తారు.
అంతెందుకు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు తర్వాత ఆశించిన స్థాయిలో ప్రజా అభిమానం సంపాదించుకోలేక పార్టీలో ఉన్నామా అంటే ఉన్నామనేలా ఎందరో ఉన్నారు. అందుకే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా వద్దా అనే చర్చను వ్యక్తిగత విమర్శలకే పరిమితం చేయకుండా, ఆయన నాయకత్వ సామర్థ్యం, రాజకీయ అనుభవం, పార్టీకి అందించిన ఫలితాలు, దేశ సమస్యలపై ఆయన ప్రతిపాదించిన పరిష్కారాల ఆధారంగా విశ్లేషించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..
మొత్తంగా చూస్తే, రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానం కుటుంబ వారసత్వంతో ప్రారంభమై, పార్టీ అత్యున్నత పదవుల దిశగా సాగిన ప్రయాణం. ఆ ప్రయాణంలో ఆయనకు లభించిన అవకాశాలు. అదే సమయంలో నాయకత్వంపై విమర్శలు, ఎన్నికల సవాళ్లు, పార్టీని పునరుద్ధరించాల్సిన బాధ్యత వంటి సవాళ్ళు ఎదురయ్యాయి. ఒక నాయకుడికి పదవి లభించడం కన్నా, ఆ పదవికి తగిన సామర్థ్యాన్ని ప్రజల ముందు నిరూపించుకోవడమే అసలైన పరీక్ష..
రాహుల్ గాంధీ విషయంలోనూ తుది తీర్పు కుటుంబ పేరు ఆధారంగా కాకుండా, ఆయన రాజకీయ పనితీరు, ప్రజలకు చేసిన సేవ, దేశ భవిష్యత్తు కోసం చూపిన దార్శనికత ఆధారంగానే ఉండాలి. ప్రజాస్వామ్యంలో నాయకత్వానికి అసలైన అర్హత వారసత్వం కాదు.. ప్రజల విశ్వాసం, సమర్థవంతమైన పాలన, జవాబుదారీతనం మాత్రమే అనేది ఎన్నో సార్లు నిరూపితమైంది.. అయితే ప్రస్తుతం దేశ రాజకీయాల్లో నెలకొంటున్న పరిస్థితుల దృష్ట్యా.. బీజేపీ చుట్టూ పద్మ వ్యూహం అల్లుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు..
బీజేపీ చేసిన అతిపెద్ద పొరపాటు నోట్ల రద్దు అని చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో సామాన్యులు పడిన పాట్లు ఇంకా మరచిపోలేదని అంటున్నారు. ఇక నాటి నుండి నేటి వరకు కమలం చుట్టూ అల్లుకుంటున్న వివాదాల నేపథ్యం గమనిస్తే.. జీఎస్‌టీని తగినంత ముందస్తు ప్రణాళిక లేకుండా వేగంగా అమలు చేయడం.. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ముందస్తు నోటీసు లేకుండా విధించిన కఠిన లాక్‌డౌన్ వల్ల కోట్ల మంది ఉపాధి కోల్పోవడం..
ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాల సృష్టి హామీని నెరవేర్చడంలో విఫలమవడం.. అలాగే ఇంధన ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై జీఎస్‌టీ విధించడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులపై భారం పడటం.. రైతు ఉద్యమం-మూడు వ్యవసాయ చట్టాలు.. కరోనా సెకండ్ వేవ్ లో నెలకొన్న నిర్వహణ లోపాలు.. మణిపూర్ హింసాకాండ.. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ED,CBI దుర్వినియోగం.. ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds) వివాదం..
అగ్నిపథ్ (Agnipath Scheme) సైనిక నియామకాల వివాదం.. పేపర్ లీకేజీలు.. రాజ్యాంగ సంస్థల నిర్వీర్యం.. మతపరమైన విద్వేష రాజకీయాలకు పాల్పడటం వంటి తీవ్రమైన ఆరోపణలు బీజేపీ ప్రతిష్టను క్రమక్రమంగా దిగజార్చాయనే ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మైనస్ అయ్యే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2028 లో జరిగే ఎన్నికలు మహా సంగ్రామాన్ని తలపించేలా సాగుతాయని అంటున్నారు.
ఇలాంటి అంశాలు కాంగ్రెస్ కు కలసి వచ్చే అవకాశాలుగా పేర్కొంటున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కెరీర్ ప్రారంభంలో రాజకీయాల్లో పార్ట్-టైమ్ లీడర్‌గా వ్యవహరించారని, కీలక సమయాల్లో విదేశీ పర్యటనలకు వెళ్లేవారని విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ ధోరణిలో మార్పు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక భారత ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ప్రధాని పీఠాన్ని అధిరోహించాలంటే ఎన్నికల్లో స్పష్టమైన ప్రజాదరణ, లోక్‌సభలో మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ తన గత బలహీనతలను అధిగమిస్తూ, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాతో ప్రజలను ఎంతవరకు మెప్పించగలరనే దానిపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు..


