తెలంగాణలో పనిచేసి వెళ్లిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు కరుణించింది. మొన్నటివరకు ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఆమె ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణలో పనిచేయాలని ఆమె గత కొంతకాలంగా ఫైట్ చేస్తున్నారు. కానీ ‘క్యాట్’(CAT) ఆమె రిక్టెస్ట్‌ను పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత క్యాడర్ కేటాయింపు వివాదాల నేపథ్యంలో ఆమెను ఏపీకి కేటాయించారు. కానీ, ఆమె అక్కడ విధుల్లో చేరడానికి అయిష్టత చూపారు.
క్యాట్‌లో దక్కని ఊరట..
తెలంగాణలో డిప్యూటేషన్ మీద కొంతకాలం పనిచేసినా తిరిగి ఏపీలో రిపోర్టు చేయాలని ‘కేడర్ అలోకేషన్ ట్రిబ్యునల్’ (క్యాట్) ఆదేశించింది. కానీ, తెలంగాణలో పనిచేసేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఏపీలో విధులు నిర్వహించే ఇంట్రెస్ట్ లేక దీర్ఘకాల సెలవులో ఉన్నారు. సెలవు కాలం పూర్తయిన తర్వాత కూడా విధుల్లో సరిగ్గా రిపోర్ట్ చేయకపోవడంతో, గత ఆగస్టులో ఏపీ ప్రభుత్వం ఆమెను పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) ఎండీ బాధ్యతల నుంచి తప్పించి సాధారణ పరిపాలన శాఖకు (GAD) రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ "పోస్టింగ్ లేని బదిలీ" చేసింది. అప్పటి నుంచి ఆమె వెయిటింగ్‌లో ఉన్నారు.
ఆమ్రపాలి రిక్వెస్ట్..
తాను మళ్లీ విధుల్లో చేరుతానని ఏపీ సర్కారుకు ఆమె విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఆమెకు తిరిగి పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలను అప్పగించింది. మొత్తం 11 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్వర్వులు జారీ చేసింది.
11 మందిలో 9 మంది ఐఏఎస్‌లకు కొత్త పోస్టింగ్‌లు ఇవ్వగా, ఇద్దరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ భవన్ ఓఎస్ఓగా సౌరభ్ గౌర్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా మురళీధర్, పర్యాటక శాఖ, సాంస్కృతికశాఖ కార్యదర్శిగా ఆమ్రపాలి, యువజన సేవల సంచాలకుడిగా నీలకంఠరెడ్డి, సామాజిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా తేజ్ భరత్, పౌర సరఫరాల సంస్థ ఎండీగా వరప్రసాద్,
పరిశ్రమలు, వాణిజ్య శాఖ సంయుక్తం కార్యదర్శిగా బి.అనిల్ కుమార్ రెడ్డి, స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు శాఖ ఉప కార్యదర్శిగా గెడేల శ్రీను కుమార్, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అదనపు కార్యదర్శిగా మంజుల బాలాజీ దిగంబర్‌కు బాధ్యతలు అప్పగించారు.
హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డైరెక్టర్ కె.శ్రీనివాసులును వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుడిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమలశాఖ డైరెక్టర్‌గా ఉన్న శుభమ్ బన్సల్ ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉత్వర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసింది.


