అమెరికా, చైనా, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు భారత ప్రభుత్వం భయపడుతోందని ప్రముఖ యూట్యూటర్ ధ్రువ్ రాఠీ ఆరోపించారు.ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఆందోళనల్లో పాల్గొనేందుకు జర్మనీ నుంచి వచ్చిన ఆయన్ను మొన్న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఆ తర్వాత మరుసటి రోజు విడుదల చేశారు. కేంద్రం ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ ఓటు చోరీకి పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ వద్ద సీఈసీ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వగా.. అందులో పాల్గొనేందుకు ధ్రువ్ రాఠీ ఇండియాకు వచ్చారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.తాను హర్యానాలోని రైతు కుటుంబం నుంచి వచ్చానని, తొలిసారి మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మారుమూల గ్రామానికి చెందిన ఓ చిన్న యూట్యూబర్ మీడియా సమావేశం నిర్వహిస్తే.. దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ 12 ఏళ్లలో ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించలేదని సెటైర్లు వేశారు. ఎవరైనా ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కచ్చితంగా ఉంటుందన్నారు.
తాను సీజేపీ పార్టీలో చేరలేదని, వ్యక్తిగతంగానే నిరసనలో పాల్గొనేందుకు వచ్చానన్నారు.దేశంలో లక్షల మంది ఓట్ చోరీపై నిరసన వ్యక్తం చేస్తున్నారని, అదే విధంగా తాను కూడా వచ్చానన్నారు.తనకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టంచేశారు.ఓటు చోరీ ఆరోపణలు వచ్చినందున సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఆయన రాజీనామా చేస్తే నిరసనలన్నీ ఆపేస్తామంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నిరసనలు చేయకుండా ఎన్నిరోజులు అడ్డుకుంటారని ఈ సందర్భంగా కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఢిల్లీని పూర్తిగా లాక్‌డౌన్‌లోనే పెడతారా?అంటూ నిలదీశారు. ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశాక కొత్త ఎన్నికల కమిషనర్‌ను దేశ ప్రధాని, ప్రతిపక్ష నేత కలిసి ఎంపిక చేయాలని, అప్పుడు ఎన్నికలు నిస్పక్షపాతంగా జరుగుతాయనే నమ్మకం ప్రజల్లో కలుగుతుందన్నారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఓ మూవీ విడుదలను కేంద్రం అడ్డుకుంటోందని, చైనాకు అనుకూలంగా సినిమాను రీషూట్ చేయించారని విమర్శలు గుప్పించారు. తాను ఎవరికీ భయపడకుండా ఓపెన్‌గా మాట్లాడుతానని వెల్లడించారు.


