హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని పక్కనే హీలియం గ్యాస్ సిలిండర్, సూసైడ్ నోట్ లభ్యం అయినట్టు సమాచారం. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది.
వివరాల్లోకివెళితే.. హరియాణాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సౌరభ్ శేఖర్ (36) గత కొంతకాలంగా హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ రాయదుర్గం పరిధిలో తన సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నాడు.ఈ క్రమంలోనే స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానని శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సౌరభ్.. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని వీవీ హైట్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.
ఆదివారం ఉదయం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సౌరభ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆ ఫ్లాట్ అడ్రస్‌కు అతని సోదరుడు వెళ్లాడు. తలుపులు పగలగొట్టి చూడగా సౌరభ్ విగతజీవిగా కనిపించాడు. దీంతో కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు మృతుడి సోదరుడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో హీలియం గ్యాస్ సిలిండర్, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మృతుడి సోదరుడిని ఎంక్వయిరీ చేయగా.. సౌరభ్
గత పదేళ్లుగా భోజనం చేసిన తర్వాత కడుపునొప్పితో బాధపడుతున్నట్టు పేర్కొన్నట్టు తెలిసింది. ప్లాట్‌లో ఎవరూ లేకపోవడంతో సౌరభ్ ఫ్రెండ్స్ గురించి సైతం విచారణ చేపట్టినట్టు సమాచారం. టెకీ మృతికి గల కారణాలపై గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్నట్టు తెలిసింది. హీలియం గ్యాస్ పీల్చి సూసైడ్ చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. సూసైడ్ నోట్‌లోని వివరాలు సైతం ఇంకా బహిర్గతం కాలేదు.


