కడప లోక్‌సభ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి రాజకీయాల్లో కీలక అడుగు వేసిన జగన్‌కు, అదే ఏడాది సెప్టెంబర్ 2న తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం పెద్ద మలుపుగా మారింది. వైఎస్సార్ తర్వాత జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్లు తెరపైకి వచ్చినప్పటికీ, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం రోశయ్య వైపు మొగ్గు చూపి ఆయనకు బాధ్యతలు అప్పగించింది.
అదేసమయంలో తన తండ్రి మరణ వార్తతో చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాలకు కారణమైంది. చివరకు 2010 నవంబర్‌లో కాంగ్రెస్‌కు, ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 2011 మార్చి 12న స్థాపించారు. అదే సంవత్సరం కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారీ విజయాలు సాధించి తన రాజకీయ బలాన్ని చాటుకున్నారు.
అక్రమాస్తుల కేసులో అరెస్టు
అయితే 2012లో సీబీఐ అక్రమాస్తుల కేసులో అరెస్టు చేయడంతో జగన్ రాజకీయ ప్రయాణంలో మరో సవాలు ఎదురైంది. దాదాపు 16 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన జగన్.. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలోనూ తన రాజకీయ పోరాటాన్ని కొనసాగించారు. ఇక వైఎస్సార్‌సీపీ 2014 ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ, అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటవడంతో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు.
విజయాన్ని అందించిన ప్రజా సంకల్ప యాత్ర
అయితే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఊహించని అవమానాలు జగన్ లో నిప్పును రగిలించినట్టు ఆయన వర్గీయులు చెప్పుకొన్నారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదిపారు.. ఈ క్రమంలో 2017 నవంబర్‌లో ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా సుమారు 3,648 కిలోమీటర్లు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సంక్షేమ హామీలతో ప్రజల్లోకి వెళ్లారు. జనం మనిషి అనిపించుకున్నారు..
చివరకు 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం అయ్యారు.. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. మే 30, 2019న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి వరకు ప్రజాధారణతో సాగిన ఆయన ప్రయాణం సీఎం అయ్యాక మరోలేవల్ కు చేరుకుంది. తనకున్న ఆశయం నెరవేరింది. ఇక టీడీపీని బలహీనపరిస్తే ఏపీలో తనకు ఎదురు లేదని భావించారు.
అభివృద్ధిని విస్మరించి, సంక్షేమానికే ప్రాధాన్యత
జగన్ సీఎం అయ్యాక రాజకీయంగా పెద్దగా అనుభవం లేని ఆయన.. పాలన ఎలా చేస్తారనే సందేహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి.. ఈ క్రమంలో పలు సంక్షేమ పథకాలకు జగన్ శ్రీకారం చుట్టారు.. ఇక అంతా సవ్యంగా సాగుతుంది అని వైసీపీ శ్రేణులు భావించారు. వరుస వలసలతో పార్టీకి కూడా నిండుదనం వచ్చింది. అయితే భారీ మెజార్టీతో అధికారపీఠం అధిరోహించిన వైఎస్సార్ కాంగ్రెస్.. 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం వెనుక పతనం ఒక్కరోజులో రాలేదని, అది గత ఐదేళ్ల ప్రభుత్వ నిర్ణయాలు, వ్యూహాత్మక లోపాల వల్లే జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు..
ఇక వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్లినప్పటికీ, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనను, పారిశ్రామిక అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. రోడ్ల మరమ్మతులు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల యువత, మధ్యతరగతి ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఇది పార్టీ బలహీనపడటానికి తొలి పునాదిగా విశ్లేషించారు..
అమరావతి రాజధాని మార్పు-మూడు రాజధానుల నిర్ణయం
ఇక జగన్ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ అమరావతి రాజధాని ప్రాజెక్టును పక్కనబెట్టి, మూడు రాజధానులు అనే ప్రతిపాదనను తీసుకురావడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనివల్ల ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన 29 వేల మందికి పైగా రైతులు సుమారు 34,000 ఎకరాలకు పైగా తమ సాగు భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అందించి రోడ్డున పడ్డారు. ఇది కేవలం ఒక ప్రాంతానికే కాక, రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై, పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను మూటగట్టింది..
వివేకానంద రెడ్డి హత్య కేసు-కుటుంబ తిరుగుబాటు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పరిణామాలు, ఆ తర్వాత వైఎస్ షర్మిల, సునీత రెడ్డి నేరుగా జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రభావం చూపింది. సొంత చెల్లెలే న్యాయం కోసం రోడ్డుపైకి రావడం, కడప జిల్లాలోనే వైసీపీని వ్యతిరేకించడం వల్ల పార్టీ నైతిక పునాదిపై ప్రకంపనాలు సృష్టించింది. అలాగే రాష్ట్ర ఓటర్లలో, ముఖ్యంగా మహిళల్లో అనుమానాలు రేకెత్తించింది..
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ భయాలు
ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన లాండ్ టైట్లింగ్ యాక్ట్ భూయజమానుల్లో, ముఖ్యంగా గ్రామీణ ఓటర్లలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. తమ భూములపై హక్కులు కోల్పోతామేమో, పాస్‌బుక్కులపై సీఎం ఫోటోలు పెట్టడం ఏమిటనే అసంతృప్తిని ప్రతిపక్ష కూటమి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ చట్టం పట్ల వ్యక్తమైన వ్యతిరేకత సైలెంట్ ఓటింగ్‌గా మారి వైసీపీని దెబ్బతీసిందని విశ్లేషకులు అంటున్నారు.
నాయకత్వ వైఫల్యాలు-సీనియర్ల అసంతృప్తి
ఇదే సమయంలో పార్టీ లోపల అంతర్గత సమన్వయ లోపం భగ్గుమన్నది. కేవలం కొద్దిమంది సలహాదారుల చేతుల్లోనే నిర్ణయాధికారాలు ఉండటం వల్ల చాలామంది సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనయ్యారు. కష్టకాలంలో క్యాడర్‌ను పట్టించుకోకపోవడం, ఎన్నికల ముందు భారీగా సిట్టింగ్ అభ్యర్థులను మార్చడం వంటి నిర్ణయాలు పార్టీ పునాదులను కదిలించాయి. ఫలితాల అనంతరం కూడా విజయసాయి రెడ్డి లాంటి సీనియర్లు పార్టీ బాధ్యతల నుండి తప్పుకోవడం దీనికి అద్దం పడుతోంది..
అధికార వికేంద్రీకరణ మిస్-ఫైర్
మరోవైపు మూడు రాజధానుల ప్రతిపాదన ద్వారా ఉత్తరాంధ్ర (విశాఖ), రాయలసీమ (కర్నూలు) ఓటర్లను ఆకట్టుకోవచ్చని వైసీపీ భావించింది. కానీ ఆచరణలో ఐదేళ్లలో ఎక్కడా ఒక్క శాశ్వత నిర్మాణం కూడా జరగకపోవడంతో మూడు ప్రాంతాల ప్రజల్లో నమ్మకద్రోహం చేశాడానే భావన ఏర్పడింది. అమరావతిని నాశనం చేశారన్న కోపం ఒకవైపు, తమ ప్రాంతాలకు కొత్తగా ఏమీ రాలేదన్న నిరాశ మరోవైపు వైసీపీకి వ్యతిరేకంగా మారాయి..
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పాటు
ఇక 2023 సెప్టెంబర్ 9న స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ పోలీసులు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ సమయంలో దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్-చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు చర్య అని బహిరంగంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే ప్రతిపక్ష నేతల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు..
అలాగే స్వయంగా జైలుకు వెళ్లి పవన్ కళ్యాణ్-చంద్రబాబుని కలిశారు. నారా లోకేష్, బాలకృష్ణలతో కలిసి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆ కష్టకాలంలో చంద్రబాబు కుటుంబానికి, టీడీపీ శ్రేణులకు నైతిక మద్దతుగా నిలిచారు.. ఇంతటితో ఆగకుండా రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ వెంటనే మీడియా సమక్షంలో సంచలన ప్రకటన చేశారు.. రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయని అధికారికంగా ప్రకటించారు.
ఏపీ భవిష్యత్తు కోసం, వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక ఈ కూటమిలోకి బీజేపీ కూడా చేరింది.. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను మార్చిన అతిపెద్ద నిర్ణయం ఈ జైలు ములాఖత్ తర్వాతే జరిగిందనేది ఇక్కడ స్పష్టం అవుతుంది. గతంలో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి వైసీపీకి లాభం చేకూరిందని భావించడం వల్లే.. మరోసారి ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి బలమైన కూటమి ఏర్పాటుకు కృషి చేశారనేది ప్రచారంలో ఉంది. ఇక ఈ కూటమి ఏర్పాటు వైసీపీ రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తుందని ఊహించడంలో జగన్ వెనక బడినట్టు విశ్లేషకులు చెప్పుకొచ్చారు.
టీడీపీకి పెద్ద టర్నింగ్ పాయింట్
రాజకీయ విశ్లేషకుల ప్రకారం, వైసీపీ ప్రభుత్వం భావించిన దానికి భిన్నంగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం క్షేత్రస్థాయిలో టీడీపీకి అనుకూలంగా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారింది. 74 ఏళ్ల వయసున్న సీనియర్ నాయకుడిని అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేసి, 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం సాధారణ ప్రజల్లో, ముఖ్యంగా ఓటర్లలో, మహిళల్లో సానుభూతిని రగిల్చింది. జగన్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.
ఇక 2019 ఓటమి తర్వాత నిరాశలో నిశబ్ధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు ఈ అరెస్ట్‌తో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. నారా లోకేష్ చేపట్టిన నిరసనలు, భువనేశ్వరి నిర్వహించిన "నిజం గెలవాలి" యాత్రల ద్వారా పార్టీ శ్రేణుల్లో పోరాట పటిమ పెరిగాయి. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఐటీ రంగ పితామహుడిగా చెప్పుకునే చంద్రబాబును అరెస్ట్ చేయడం ఐటీ ఉద్యోగులు, యువతలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు ఏపీలోని పలు నగరాల్లో ఐటీ నిపుణులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మద్దతు తెలపడం ఓటింగ్ సరళిని మార్చింది. రాష్ట్రంలో ఫాసిస్ట్ పాలన నడుస్తోందనే ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లింది.. మొత్తంగా చూస్తే, వైసీపీ ఈ అరెస్ట్‌ను లీగల్ అస్త్రంగా భావించినప్పటికీ, అది రాజకీయంగా టీడీపీకి బూస్టర్‌లా మారి కూటమి ప్రభంజనానికి ఒక బలమైన ఆయుధంగా మారింది.
కొంప ముంచిన ఉచిత పథకాల ఎఫెక్ట్
మరోవైపు వైసీపి ప్రభుత్వం కేవలం ఉచిత పథకాలే సర్వస్వం అన్నట్లుగా ముందుకు సాగింది. అయితే, సమాజంలో ఒక వర్గం కేవలం ఉచితాలకే పరిమితం కాకుండా ఉపాధి, ఐటీ ఉద్యోగాలు, పరిశ్రమలు, రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధిని ఆకాంక్షించింది. అలాగే నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ రాకపోవడం పెద్ద మైనస్ అయింది. చంద్రబాబు ఐటీ, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ కావడం, ఆయన్ను జైలుకు పంపడంతో అభివృద్ధిని పూర్తిగా అణచివేస్తున్నారనే భావన యువతలో బలపడింది.
మొత్తానికి ఏపీలో ఈ సామాజిక, ఆర్థిక, మానసిక అంశాలన్నీ కలిసికట్టుగా పనిచేసి 2024లో ఎన్నికల్లో ఊహించని రీతిలో కూటమికి 164 స్థానాల భారీ విజయాన్ని అందించగా, వైసీపీకి చారిత్రాత్మక పతనాన్ని మిగిల్చాయి..
ఆర్థిక ఇబ్బందులు-విరాళాల తగ్గుదల
ఇక వైసీపీ పతనం కేవలం ఓటమితోనే ఆగకుండా పార్టీ ఆర్థిక వనరులపై కూడా పడింది. అధికారంలో ఉన్నప్పుడు భారీగా నిధులు సమకూరినప్పటికీ, పతనం ప్రారంభమయ్యాక 2025-26 ఆర్థిక సంవత్సరంలో వైసీపీకి అందిన విరాళాలు 82 శాతం మేర క్షీణించి దాదాపు 24.31 కోట్లకు పడిపోయాయి. ఇది పార్టీ నిర్వహణకు ఆటంకంగా మారిందని చెప్పుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమవ్వడం, కీలకమైన రాజధాని వివాదం-కూటమి వ్యూహాన్ని తక్కువ అంచనా వేయడం వంటి పలు కీలక నిర్ణయాల్లో తడబడిన అడుగులే వైసీపీ పతనానికి ప్రధాన పునాదులుగా నిలిచాయని తెలుస్తుంది..


