కేటీఆర్ కంచుకోటలో సీఎం రేవంత్ హడావుడి
కార్మికుల షాక్‌తో కోలుకోని స్థితిలో కాంగ్రెస్!
సిరిసిల్ల డిపోలో 'టీఎంయూ' అఖండ విజయం
వేములవాడలోనూ కాంగ్రెస్‌కు నిరాశే
స్థానిక కాంగ్రెస్ నాయకత్వంలో అంతర్మథనం
రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలపై ప్రభావం?
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో పర్యటించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంచుకోట అయిన సిరిసిల్లలో సీఎం పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయమైంది. ఒక వైపు పార్టీ సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. రేవంత్ పర్యటన పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తిగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల జరిగిన ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.
ఈ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతు ఇచ్ఛిన 'టీడబ్ల్యూయూ' ఘోర పరాజయంపాలు కావడం స్థానిక రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సీఎం సభ తెచ్చిన హడావుడి ఓవైపు, కార్మికుల నుంచి వచ్చిన ఈ భారీ వ్యతిరేకత మరోవైపు అధికార పార్టీ నాయకత్వాన్ని తీవ్ర ఆత్మరక్షణలోకి నెట్టేశాయనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ తేడాతో ఓటమిపాలవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సిరిసిల్ల డిపో పరిధిలో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి 'టీఎంయూ' (TMU) యూనియన్ అఖండ విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు డలా పడ్డాయి. ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే అధికార పార్టీకి కార్మికుల్లో ఉన్న పట్టు ఏపాటిదో స్పష్టమవుతోంది.
సిరిసిల్ల క్లాస్-3 విభాగంలో టీఎంయూ యూనియన్‌కు ఏకంగా 167 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్ మద్దతిచ్చిన కూటమి టీడబ్ల్యూయూకు కేవలం 31 ఓట్లు మాత్రమే దక్కాయి. అదేవిధంగా క్లాస్-6 విభాగంలోనూ టీఎంయూకు 178 ఓట్లు రాగా, అధికార పార్టీ కూటమికి కేవలం 38 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ గణాంకాలు అధికార పార్టీకి కార్మిక వర్గంలో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం సిరిసిల్ల మాత్రమే కాకుండా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న పొరుగునే ఉన్న వేములవాడ నియోజకవర్గంలోనూ అధికార పార్టీకి ఇదే చేదు అనుభవం ఎదురైంది. వేములవాడలో క్లాస్-3 విభాగంలో టీఎంయూకు 183 ఓట్లు రాగా, కాంగ్రెస్ మద్దతు కూటమికి కేవలం 29 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అలాగే క్లాస్-6లో టీఎంయూకు 166 ఓట్లు రాగా, టీడబ్ల్యూయూకు కేవలం 43 ఓట్లు మాత్రమే దక్కాయి. రెండు కీలక ప్రాంతాల్లోనూ అధికార పార్టీ బలపరిచిన యూనియన్ చిత్తుగా ఓడిపోవడం స్థానిక నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది.
ఈ ఘోర పరాజయానికి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సభే కారణమని స్థానిక కాంగ్రెస్ నాయకులు అంతర్గతంగా మదనపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం సభ జరిగినా కార్మికులను ఆకట్టుకోవడంలో పార్టీ విఫలమైందని, పైగా సభ వల్ల ప్రజలు, కార్మికుల్లో పార్టీపై ఉన్న కొంత ఆదరణ కూడా దెబ్బతిందని వారు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో స్థానికంగా జరిగే ఎన్నికల్లో ఆర్టీసీ కార్మిక వర్గాల నుంచి వ్యక్తమైన ఈ వ్యతిరేకతను అధిగమించడంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


