రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు నెలకొంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. నీళ్లు లేక ఓవైపు పంటలు ఎండిపోతున్నాయని, తాగు నీటికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు. కరువు పరిస్థితులు నెలకొంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. సాగుకు నీళ్లు లేక అన్నదాతలు జనరేటర్ల ద్వారా పంటకు నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కనిపించడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, జలాశయాల్లో నీరు ఎండిపొతున్నా రాష్ట్ర సర్కారు మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. కరువు పరిస్థితులపై చర్చించేందుకు రైతులందరూ రైతు వేదికలకు రావాలని ఆదివారం ప్రభుత్వం ఓ సర్క్యులర్ ఇచ్చిందని తెలిపారు.
సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రైతులకు ఎల్‌నినోపై అవగాహన కల్పిస్తారని అందులో పేర్కొన్నారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలకు సైతం జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల నుండి ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఉదయం 9.52 నిమిషాలకు మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ రద్దు అయ్యిందని ప్రకటన ఇచ్చారని తెలిపారు. మళ్లీ ఉదయం 11:15 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది రావాలని అని చెప్పి, మళ్లీ కాసేపటికి 1:00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రారని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వస్తారని చెప్పారన్నారు.
రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నేతలు చిన్న పిల్లల ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సీఎం రేవంత్ రెడ్డి గోవా వెళితే, మంత్రులు ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. ఎల్‌నినో లాంటి సీరియస్ ప్రాబ్లం మీద మీ చిత్తశుద్ధి ఇదేనా? అని ప్రశ్నించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ‘గోవా, ఢిల్లీ’ అని ట్రిప్పులు వేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేస్తున్న నిరసనల కోసం వెళ్లడం అవసరమా? రాష్ట్రంలో సమస్యల కంటే అదే ఇంపార్ట్మెంటా? అని నిలదీశారు.


