టాప్ న్యూస్

TG : తాగు, సాగు, బీర్లు.. రేవంత్ సర్కారుకు ఏది ప్రాధాన్యం?

రచన: Kumar••11 నిమిషాల పఠనం

రాష్ట్రంలో కరువు కోరలు చాస్తున్న సమయంలో పంటలకు హాలిడే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.అందుకే వరి పంటలు వేయొద్దని, వేస్తే నీళ్లు ఇవ్వడం కష్టతరం అవుతోందని మంత్రులు రాష్ట్ర రైతాంగానికి సూచించారు.ఎన్‌నినో కారణంగా రాష్ట్రంలో 17శాతం లోటు వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో కరువు కోరలు చాస్తున్న సమయంలో పంటలకు హాలిడే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.అందుకే వరి పంటలు వేయొద్దని, వేస్తే నీళ్లు ఇవ్వడం కష్టతరం అవుతోందని మంత్రులు రాష్ట్ర రైతాంగానికి సూచించారు.ఎన్‌నినో కారణంగా రాష్ట్రంలో 17శాతం లోటు వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. వర్షాకాలంలో వేసవి మాదిరి ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి సామర్థ్యం తగ్గిపోతోంది. వర్షాలు లేక భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోతున్నాయి. తెలంగాణ కేబినెట్ 235 మండలాలను కరవు మండలాలుగా ఇప్పటికే ప్రకటించింది. మున్ముందు ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పంటలకు విరామం తప్పదా?

రాష్ట్రంలో తీవ్రమైన నీటి కొరత, వర్షాభావ పరిస్థితులు (ఎల్‌నినో ప్రభావం), భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో రెండో పంటగా ‘వరి’ వేయవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతులకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. ఆరుతడి పంట్లపై ఫోకస్ పెట్టాలన్నారు. మంత్రి తుమ్మల సైతం ఇదే సూచన చేశారు. వరి వేస్తే ఈ దేవుడు దిగొచ్చిన నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. దీంతో 'క్రాప్ హాలీడే' (పంట విరామం) ప్రకటించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని విపక్షాలు, వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ప్రకటన చేయడమే తరువాయి.

మున్ముందు గడ్డు పరిస్థితులు..

రాష్ట్రంలో మున్ముందు గడ్డు పరిస్థితులు తలెత్తె అవకాశం ఉందని వాతావరణ, వ్యవసాయ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎల్‌నినో సూపర్ ఎల్‌నినోగా మారే అవకాశం ఉందని, ఫలితంగా వర్షాలు లేక ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే పంటలు పండక, నీరు లేక సాగు, తాగు నీటి ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులూ తలెత్తే అవకాశం ఉందని, వృథా ఖర్చులు చేయరాదని, నీటి వృథా కూడా తగ్గించాలని ప్రజానీకానికి ముందస్తు సూచనలు చేస్తున్నారు.

గణనీయంగా పడిపోయిన సాగు..

ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సాగు గణనీయంగా పడిపోయింది.గతంతో పోలిస్తే ఈసారి భారీగా దిగుబడి తగ్గుతుందని వ్యవసాయ శాఖ నిపుణులు అంచనా వేశారు.గతేడాది వానాకాలం సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం 66.77 లక్షల ఎకరాలు ఉండగా.. ప్రస్తు ఖరీఫ్‌లో 54.26 లక్షల ఎకరాలుగా ఉంది. గతేడాది మొత్తం వరి దిగుబడి 148 - 153 లక్షల టన్నులు ఉండగా.. ఈసారి 65 లక్షల టన్నులు (ప్రభుత్వ సేకరణ లక్ష్యం)గా ఉంది. 15 నుంచి 17 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో రాష్ట్రంలోని 33 జిల్లాలలో సుమారు 14 నుండి 18 జిల్లాలు తీవ్రమైన నీటి కొరతను, కరువు లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.నీటి లభ్యత తగ్గడం వల్ల పంట పొలాలు ఎండిపోవడమే కాకుండా, రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో కూడా వరి సాగు విస్తీర్ణం దాదాపు 40% వరకు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు హెచ్చరిస్తున్నారు.

డెడ్ స్టోరీజీకి ప్రాజెక్టులు..

తెలంగాణ ఐడీఎస్‌ఎస్ అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని 87 రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యం 1059.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం వాటిలో 507.22 టీఎంసీల నీరు నిల్వ మాత్రమే ఉంది. శ్రీశైలంలో పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఉన్న నిల్వ 69.01 టీఎంసీలు.

ఇక నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలైతే ప్రస్తుతం ఉన్న నిల్వ 188.95 టీఎంసీలు. పులిచింతల పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఉన్న నిల్వ 28.95 టీఎంసీలు. జూరాల పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఉన్న నిల్వ 7.68 టీఎంసీలు. మూసీ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 4.46 టీఎంసీలు అయితే ప్రస్తుతం ఉన్న నిల్వ 2.84 టీఎంసీలు, మంజీరాలో పూర్తి సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఉన్న నిల్వ 0.21 టీఎంసీలుగా ఉంది.

తాగు నీటి కష్టాలు తప్పవా?

ఉత్తర తెలంగాణలోని పలుజిల్లాల్లో ఇప్పటికే తాగు నీటి కటకట మొదలైంది. హైదరాబాద్, పలు జిల్లాల్లో ప్రస్తుతం తాగునీటి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. సాధారణంగా వేసవిలో వచ్చే నీటి ఎద్దడి, ఈసారి డిసెంబర్ లేదా జనవరి నాటికే మొదలయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.దీంతో ప్రభుత్వం ఈసారి తాగు నీటికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. కానీ, ఐటీ కారిడార్‌కు నీరందించే సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 13% (3.9 TMC) నీరు మాత్రమే ఉంది. ఇది మరో 60 రోజులకు మాత్రమే సరిపోతుందని అంచనా. అలాగే ఉస్మాన్‌సాగర్ నీటిమట్టం 3.5 TMCల నుండి 2.2 TMCలకు పడిపోయింది.హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం రోజుకు 750 మిలియన్ గ్యాలన్ల (MGD) నీరు అవసరం పడుతుండగా.. జలమండలి కేవలం 585 నుండి 600 MGD మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. లోటు వర్షపాతం కారణంగా గతేడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు 6.85 మీటర్ల మేర పడిపోయాయి.

బీర్లకే ప్రయారిటీ.. మంత్రి జూపల్లి క్లారిటీ!

రాష్ట్రంలో తాగు, సాగు నీటి పరిస్థితి పైన చెప్పిన విధంగా ఉండగా.. మంత్రి జూపల్లి కృష్ణా రావు బీర్ల కొరత రాకుండా చూసుకుంటామని ఇటీవల కంపెనీలకు హామీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.ఓ చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎల్‌ నినో (El Nino) ప్రభావం ఉన్నప్పటికీ, మద్యం, బీర్ల ఉత్పత్తికి ఎలాంటి నీటి కొరత రాకుండా చూసుకుంటామన్నారు. బీరు తయారీకి నీటి ఇబ్బందులు రాకుండా అవసరమైతే శ్రీశైలం నుండి నీటిని తీసుకుంటామని చెప్పారు. దీనిపై మాజీమంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. అన్నదాతలకు సాగు నీరివ్వడం కంటే మీకు బీర్ల ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమా? అని విమర్శలు గుప్పించారు. దీంతో ఎక్సైజ్ శాఖ మంత్రి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తాను శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తానని ఎక్కడా చెప్పలేదని, డిండి ప్రాజెక్టులోకి ఏదుల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకుంటే తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మాత్రమే అన్నానని క్లారిటీ ఇచ్చుకున్నారు.

సర్కారు ప్రాధాన్యం దేనిమీద?

మంత్రి జూపల్లి వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. బీర్ల తయారీకి నీటి కొరత రాకుండా చూసుకుంటామని మంత్రి చెప్పిన మాటలను ప్రతిపక్షాలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు, నెటిజన్లు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. మీకు రాష్ట్ర రైతాంగం, ప్రజలు ముఖ్యమా? బీర్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమా? వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మీకు ఓట్లు వేసి గెలిపించిన రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు ఇవ్వడం కంటే.. మద్యం ద్వారా వచ్చే ఆదాయానికే ప్రభుత్వం ప్రాధాన్యత సిగ్గుచేటని విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ మంత్రి వరి వేయొద్దు అంటారు? మరో మంత్రి వేస్తే నీళ్లివ్వము అంటారు.. ఇంకోమంత్రి బీర్ల తయారీకి నీళ్లిస్తామంటాడు. ఎవరూ ఒక మాటమీద ఉండటం లేదని.. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి త్వరగా ప్రకటన చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

#Elnino#Crop holiday#beers production#Water supply#ministers voice#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి