Plastic Plates Risks: శుభకార్యాలు, దావత్‌లు, హోటళ్లు, చివరకు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ల దాకా ఎక్కడ చూసినా విస్తరాకుల స్థానాన్ని రంగురంగుల ప్లాస్టిక్ ప్లేట్లు ఆక్రమించేశాయి. వాడటం సులువు, కడిగే పనిలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ప్లాస్టిక్ ప్లేట్లను విచ్చలవిడిగా వాడేస్తున్నాం. కానీ వేడి వేడి అన్నం, మసాలాలు నిండిన కూరలు, వేడి సాంబార్‌ను ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో వేసుకుని తింటుంటే.. తెలియకుండానే శరీరంలోకి తీవ్రమైన విషాన్ని పంపుతున్నామని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేడి తగలగానే కరిగే విష రసాయనాలు!
చాలావరకు వాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు ఏమాత్రం ‘ఫుడ్ గ్రేడ్’ ప్రమాణాలతో తయారైనవి కావు. వాటిలో ప్లాస్టిక్ మెత్తగా, అనువుగా ఉండటానికి థాలైట్స్, బిస్‌ఫినాల్-ఎ (BPA) వంటి ప్రమాదకర కెమికల్స్ కలుపుతారు. వేడి వేడి ఆహార పదార్థాలు ఆ ప్లేట్లలో పడగానే ఆ వేడికి ప్లాస్టిక్‌లోని విషపూరిత రసాయనాలు కరిగి ఆహారంలో కలిసిపోతాయి (కెమికల్ మైగ్రేషన్). ఈ రసాయనాలు నేరుగా కడుపులోకి చేరి రక్తంలో కలిసిపోవడం వల్ల శరీరంలోని కీలక వ్యవస్థలు క్రమంగా కుప్పకూలిపోతాయి.
హార్మోన్ల సమతుల్యత ధ్వంసం.. క్యాన్సర్ ముప్పు
ప్లాస్టిక్ రసాయనాలు శరీరంలోకి చేరిన తర్వాత కలిగే నష్టాలు అంతా ఇంతా కాదు. ప్లాస్టిక్‌లోని బీపీఏ రసాయనం శరీరంలో చేరి ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. ఇది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి, మహిళల్లో పీసీఓడీ వంటి సంతానలేమి సమస్యలకు కారణమవుతుంది. రక్తంలోకి చేరే టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేయలేక లివర్, కిడ్నీలు తీవ్ర ఒత్తిడికి గురై దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. నిరంతరం ప్లాస్టిక్ రసాయనాలు శరీరంలో చేరడం వల్ల క్యాన్సర్ కారక కణాలు ఉత్తేజితమై ప్రాణాంతక క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.
చిన్నారులు, గర్భిణీలకు పెను విపత్తు
ప్లాస్టిక్ ప్లేట్ల ప్రభావం పెద్దల కంటే పిల్లలు, గర్భిణులపై అత్యంత తీవ్రంగా ఉంటుంది. పిల్లల్లో శరీర అవయవాలు, రోగనిరోధక వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందవు కాబట్టి వారి మానసిక, శారీరక ఎదుగుదల మందగిస్తుంది. గర్భిణులు ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారం తీసుకోవడం వల్ల ఆ రసాయనాలు పిండంపై ప్రభావం చూపి, గర్భస్రావం జరగడం లేదా పుట్టబోయే బిడ్డలు పుట్టుకతోనే లోపాలతో జన్మించే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పాత పద్ధతులే శ్రీరామరక్ష
సులువుగా ఉందని ప్రాణాలను పణంగా పెట్టే ప్లాస్టిక్ వాడకాన్ని తక్షణమే తగ్గించుకోవాల్సిన సమయం వచ్చింది. పూర్వం మన పెద్దలు వాడిన సంప్రదాయ అరిటాకులు, మోదుగ విస్తరాకులు, లేదంటే నిత్యం ఇంట్లో వాడే స్టెయిన్‌లెస్ స్టీల్, గాజు ప్లేట్లే ఆరోగ్యానికి అత్యుత్తమం. వాడి పారేసే ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి ఆహారం తిని స్వయంగా విషాన్ని ఆహ్వానించడం కంటే.. పరిశుభ్రమైన, సురక్షితమైన పాత్రలను ఉపయోగించడమే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


