పాఠశాలలో హిజాబ్ ధరించి వచ్చేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరుతూ ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. హిజాద్ అనేది ఇస్లాంలో తప్పనిసరి కాదని, ఈ మేరకు సరైన ఆధారాలు కూడా లేవని కోర్టు అభిప్రాయపడింది. విద్యాసంస్థల్లో యూనిఫామ్ అనేది పాటించాలని పేర్కొంది.
తాజాగా అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు కోర్టు తీర్పును స్వాగతిస్తుంటే ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇస్లాం ప్రకారం ఏం చేయాలో తమ ఇష్టమని, ఇందులో కోర్టు జోక్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టారు. తాజాగా ఆయన నగరంలోని ఓ ఈవెంటులో మాట్లాడుతూ.. హిజాబ్ వివాదంపై కోర్టు తీర్పుపై స్పందించారు.
స్కూల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతి నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు.ఈ తీర్పును ఇస్లాంపై దాడిగా అభివర్ణించారు. ‘ఇది మా మతం, ఏది అవసరమో మేమే నిర్ణయించుకుంటాం. నిర్ణయించడానికి న్యాయమూర్తులు ఎవరు?’ అంటూ ఫైర్ అయ్యారు. ఇస్లాంకు ఏది ముఖ్యమో, ఏది కాదో నిర్ణయించడం న్యాయమూర్తుల పని కాదన్నారు.
కాగా, స్కూల్ యూనిఫామ్‍కు అదనంగా హిజాబ్ ధరించేందుకు తనకు అనుమతి ఇచ్చేలా విద్యాసంస్థను ఆదేశించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‍ను ధర్మాసనం కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, ఆర్టికల్ 25కు వ్యతిరేకమని ఓవైసీ ఆరోపించారు. శబరిమల కేసుకు సంబంధించి అత్యవసర మతాచారాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. ఈ తీర్పు వల్ల యూపీలో ముస్లిం బాలికల విద్య దెబ్బతింటుందని, వారిని చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు.


