రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం నెలకొంది.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఫ్లోరిడా రాష్ట్రంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే కారులోని ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్టు సమాచారం.
మృతుల్లో ఒకరు నిజామాబాద్ జిల్లా (నవీపేట)కు చెందిన రాహుల్‌గా గుర్తించారు. ఉన్నత విద్య కోసం సుమారు మూడు నెలల క్రితమే రాహుల్ అమెరికా వెళ్లినట్టు తెలిసింది. ప్రమాదంలో మరణించిన వారి వివరాలను ఫ్లోరిడాలోని స్థానిక అధికారులు వారి కుటుంబాలకు సమాచారం అందించారు. మిగిలిన ఇద్దరు విద్యార్థుల గురించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా, రాహుల్ మరణవార్త తెలియగానే నిజామాబాద్‌లోని అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.అతని కుటుంబ సభ్యులు, బంధువులు షాక్‌లో ఉన్నట్టు సమాచారం.కాగా, ఈ ప్రమాదం మీద ఫ్లోరిడా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. కారు బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా నిద్రమత్తులో ప్రమాదం చోటుచేసుకుందా? అని విచారిస్తున్నట్టు తెలిసింది.స్థానిక పోలీసులు తమ విచారణను పూర్తి చేసిన అనంతరం భారత అధికారులతో సమన్వయం చేసుకుని మృతదేహాలను ఇండియా పంపించనున్నట్టు సమాచారం.


