ప్రకృతి కన్నెర్ర చేస్తే.. మనిషి నిర్మించిన ప్రపంచం క్షణాల్లో తలకిందులవుతుంది... ప్రకృతి శక్తి ముందు మనిషి ఎంత చిన్నవాడో అప్పుడప్పుడు సంభవించే విపత్తులు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆకస్మికంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాణాలతో పాటు ఆస్తినష్టం భారీగా సంభవించిన ఘటనలున్నాయి. ఇక ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల దేశంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.
తాజాగా నేపాల్‌లోని రసువా జిల్లాలో బుధవారం ఉదయం ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఉప్పొంగిన భోటేకోషి నది పరిసర గ్రామాలను జలదిగ్బంధంలోకి నెట్టింది. నదీ తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు క్షణాల్లో జలమయమయ్యాయి. జనావాసాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. వరద ఉద్ధృతిలో స్థానికులు కొట్టుకుపోయిన తీరు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వరద ఉదృతికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లతో పాటు ఇతర మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తరగయ గ్రామీణ మునిసిపాలిటీ ఉపాధ్యక్షురాలు చమేలీ గురుంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్యాఫ్రూబెసి, బెట్రావతి, మైలుంగ్, సల్లెతార్, శాంతిబజార్, పైరేబెసి, ఖాల్తీ బస్తీ, సోలే, త్రిశూలి, బట్టార్ తదితర డజనుకు పైగా గ్రామాలు వరదల ప్రభావానికి గురయ్యాయి.
కాగా ఇంకా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వంటి వివరాలు తెలియరాలేదు. అయితే స్థానిక అధికారులు, ప్రజలు, భద్రతా సిబ్బంది నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. నష్టం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీయగా.. వెయ్యి మందికి పైగా వరద ప్రవాహంలో గల్లంతై ఉండొచ్చనే సందేహం వ్యక్తమవుతోంది. మరోవైపు బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.
ఇక ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల సుమారు 4 వేల మందికి పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. పరిస్థితి విషమంగా మారడంతో నేపాల్ రెడ్ క్రాస్ స్పందన బృందాలను అప్రమత్తం చేసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు అధికారులు కీలక సూచనలు చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు నేపాల్ ప్రభుత్వం రెండు సైనిక హెలికాప్టర్లను రంగంలోకి దించింది. నేపాల్ ఆర్మీ, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలను కూడా రసువా జిల్లాకు తరలిస్తున్నారు.
అలాగే వరద పరిస్థితిపై హోం మంత్రిత్వ శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి బాలేంద్ర షా కూడా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి సహాయక, రక్షణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా దేశంలోని ఐదు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.


