* దిగొస్తున్న ప్రభుత్వం !!
* 22A క్లియర్ చేస్తామని బ్రోకర్లతో ఒక్కొ కాలనీలో కోటి నుంచి 5కోట్ల బేరసారాలతో దందాకు ప్రయత్నం !!
* చీకటి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి !
* ప్రతిపక్షాల ఆందోళన, మంత్రి రాజీనామా అంటూ డిమాండ్ పెరగడంతో ఒక్కో కాలనీని 22A నుంచి తొలగిస్తున్న అధికార యంత్రాంగం
* బ్రోకర్లను నమ్మొద్దు.. హెచ్చరిస్తున్న ‘స్వేచ్ఛ'
22A Lands: 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దిగి వస్తోంది. ఒక్కొక్క కాలనీని 22ఏ నిషేధిత జాబితా నుంచి అధికార యంత్రాంగం తొలగిస్తోంది. కాగా, 22ఏ పేరుతో వసూళ్ల దందా నడిచింది. 22ఏ లిస్ట్ నుంచి క్లియర్ చేస్తామని బ్రోకర్లతో ఒక్కో కాలనీలో కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు బేరసారాల దందాకు ప్రయత్నం జరిగింది.
ఈ చీకటి వ్యవహారాన్ని ‘స్వేచ్ఛ’ న్యూస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల వెలుగులోకి తెచ్చారు. దీని ఆధారంగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలన్న డిమాండ్లు పెరిగాయి. దీంతో ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో రేవంత్ సర్కార్ దిగి వచ్చింది. ఒక్కొక్క కాలనీని 22ఏ జాబితా నుంచి అధికారులు తొలగిస్తున్నారు. మరోవైపు 22ఏ నిషేధిత జాబితా నుంచి క్లియర్ చేస్తామని ఎవరైనా బ్రోకర్లు వస్తే.. వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని ‘స్వేచ్ఛ’ న్యూస్ బాధితులను హెచ్చరిస్తోంది.
22ఏ జాబితా నుంచి ప్రైవేట్ ఆస్తులను తొలగించే కసరత్తు మొదలు పెట్టింది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే డిఫెన్స్ హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ (O/R) లిమిటెడ్, డిఫెన్స్ కాలనీకి చెందిన సుమారు A.112:03 గుంటల భూమికి సంబంధించి కీలకమైన పరిపాలన, చట్టపరమైన పురోగతి లభించింది.
సొసైటీ తరపున నిరంతర ప్రయత్నాలు, సంబంధిత అధికారులతో సమన్వయం, అవసరమైన పత్రాల సమర్పణ, చట్టపరమైన ఫాలో అప్ తర్వాత సొసైటీ భూములకు సంబంధించి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి అవసరమైన NOC (నిరభ్యంతర ధృవీకరణ పత్రం) మంజూరైంది. అదే విధంగా సొసైటీ భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో కీలకమైన అడుగు పడింది.
దీంతో సొసైటీ సభ్యులు, ప్లాట్ యజమానులకు ఎంతో ఉపశమనం లభించింది. 22-A పరిమితుల కారణంగా ఇంతకాలం రిజిస్ట్రేషన్లు, ఆస్తుల బదలాయింపు, అభివృద్ధి, ఇతర ఆస్తి సంబంధిత లావాదేవీలలో ఎదురైన ఇబ్బందులకు ఎట్టకేలకు పరిష్కారం లభించనుంది.
ఈ విజయాన్ని పురస్కరించుకుని డిఫెన్స్ హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శి, మేనేజింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞత కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ ప్రతినిధులు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు కృషి చేసిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ఇది కేవలం ఒక పరిపాలన విజయమే కాకుండా సొసైటీ సభ్యులు, ప్లాట్ యజమానుల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని సొసైటీ నాయకత్వం పేర్కొంది.
బ్రోకర్లను నమ్మొద్దు..స్వేచ్ఛ హెచ్చరిక
22ఏ నిషేధిత జాబితా నుంచి మీ భూములు, ప్రాపర్టీలు తొలగిస్తామని కొందరు బ్రోకర్లు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి బ్రోకర్లను నమ్మి డబ్బులు చెల్లించొద్దని స్వేచ్ఛ న్యూస్ బాధితులను హెచ్చరిస్తోంది. బ్రోకర్లకు నయా పైసా కూడా ఇవ్వొద్దని స్పష్టం చేస్తోంది.


