టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశారంటూ ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆయనపై కేసు నమోదైంది. చాలా కాలంగా తనతో సహజీవనం చేసి లైంగికంగా వాడుకున్నారని, ఆపై ముఖం చాటేశారని ఆరోపిస్తు ఆ నటి పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పవన్ సాధినేనిని అరెస్ట్ చేసి, 15 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు.
మరోవైపు ఈ ఫిర్యాదు చేసింది ప్రముఖ నటి గాయత్రి గుప్త సినిమా సర్కిల్ ల్లో ప్రచారం జరుగుతుంది. కాగా పవన్ సాధినేని 'ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి', 'సేనాపతి' వంటి చిత్రాలతో పాటు 'పిల్ల', 'ఈ ఆఫీస్‌లో', 'కమిట్‌మెంటల్', 'దయా' వంటి ప్రసిద్ధ వెబ్ సిరీస్‌లను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రస్తుతం ఈయన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కాంబినేషన్‌లో 'ఆకాశంలో ఒక తారా' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇక ఇటీవలి కాలంలో తెలుగు చిత్రసీమలో ప్రేమ, పెళ్లి, అవకాశాల పేరుతో జరిగే మోసాలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. గ్లామర్ ప్రపంచంలో వెలుగుల వెనుక ఇటువంటి చీకటి కోణాలు తరచూ ఇండస్ట్రీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. గతంలోనూ పలువురు ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడం, మీటూ ఉద్యమం సమయంలో అనేకమంది నటీమణులు తమకు జరిగిన అన్యాయాలపై బహిరంగంగా పెదవి విప్పడం గమనార్హం.
కొందరు అవకాశాలు ఇస్తామని చెప్పి, మరికొందరు పెళ్లి చేసుకుంటామని నమ్మించి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టే యంగ్ ఆర్టిస్టుల జీవితాలతో ఆడుకుంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. టాలెంట్‌కు పట్టం కట్టాల్సిన సినీ పరిశ్రమ, ఇటువంటి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు, లైంగిక వేధింపుల ఘటనల వల్ల ఇప్పటికే విమర్శలను ఎదుర్కొంటుంది.. ఇప్పుడు పవన్ సాధినేని అరెస్ట్ వ్యవహారంతో చిత్రసీమలో మరోసారి ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.


