తెలంగాణ

Sridhar Babu: డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా మీ సేవా కేంద్రాలు- మంత్రి శ్రీధర్ బాబు

రచన: NK26, ఆగ 20268 నిమిషాల పఠనం

తెలంగాణలోని ప్రతి మీ సేవా కేంద్రాన్ని డిజిటల్ మార్కెటింగ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. స్థానిక వ్యాపారులకు డిజిటల్ ప్రచార అవకాశాలను చేరువ చేయడమే లక్ష్యంగా మీ సేవా-మెటా సంయుక్త కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు చెప్పారు.

* మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు

* రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ సేవల విస్తరణ

* మెటాతో కలిసి వీఎల్‌ఈలకు ప్రత్యేక శిక్షణ

* కొత్త పోర్టల్‌, టోల్‌ఫ్రీ సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

Sridhar Babu: తెలంగాణలోని ప్రతి మీ సేవా కేంద్రాన్ని డిజిటల్ మార్కెటింగ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. స్థానిక వ్యాపారులకు డిజిటల్ ప్రచార అవకాశాలను చేరువ చేయడమే లక్ష్యంగా మీ సేవా-మెటా సంయుక్త కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని షెరటాన్‌ హోటల్‌లో బుధవారం మీ సేవా డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ రెండో దశ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 140 మందికి పైగా మీ సేవా విలేజ్‌ లెవల్‌ ఎంటర్‌ప్రెన్యూర్లు (వీఎల్‌ఈలు) హాజరయ్యారు. వీరికి ‘డిజిటల్ బిజినెస్ అంబాసిడర్లుగా’ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఆదాయ అవకాశాలను పెంచే వేదికలుగా మారాలి

కొత్త సాంకేతికతను స్వీకరించడంలో తెలంగాణ ఎప్పుడూ ముందుంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సమర్థవంతమైన పౌర సేవలను అందించడంలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5వేలకు పైగా మీ సేవా కేంద్రాలు ఉన్నాయని.. వీటి ద్వారా స్వీట్‌ షాపుల నుంచి టెక్స్ టైల్ స్టోర్స్, నైపుణ్య వృత్తిదారులు, ఇతర చిన్న వ్యాపారులకు డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలను చేరువ చేయవచ్చని వెల్లడించారు. వ్యాపారులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ సేవ ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. మీ సేవా కేంద్రాలు పౌర సేవలకే పరిమితం కాకుండా ప్రజలకు డిజిటల్ అవగాహన కల్పించి, ఆదాయ అవకాశాలను పెంచే వేదికలుగా మారాలని తెలిపారు. కొత్త ఆలోచనలు, సేవలు, వ్యాపార అవకాశాలను తెలంగాణ ఎప్పుడూ స్వాగతిస్తుందని వెల్లడించారు. ప్రజల ఆదాయం, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇవి దోహదపడతాయన్నారు.

తక్కువ వ్యయంతో ఉత్పత్తుల ప్రచారం

ఈ కార్యక్రమాన్ని తొలుత హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ/క్యూర్‌ పరిధిలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టారు. సుమారు 120 మంది మీ సేవా వీఎల్‌ఈలకు డిజిటల్ మార్కెటింగ్, సోషల్‌ మీడియా ప్రకటనలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారిలో 10 మందికిపైగా ఇప్పటికే ప్రత్యక్ష డిజిటల్ ప్రకటనల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక వ్యాపారులకు ఇప్పటివరకు 17కుపైగా ప్రకటనలను రూపొందించి ప్రచురించారు. ఈ కార్యక్రమంతో వీఎల్‌ఈలకు కొత్త ఆదాయ మార్గం అందుబాటులోకి వచ్చింది. స్థానిక వ్యాపారులు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికల్లో తక్కువ వ్యయంతో తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేసుకునే అవకాశం ఏర్పడింది.

డిజిటల్ బిజినెస్ అంబాసిడర్లుగా VLEలు

తొలి దశలో మంచి ఫలితాలు రావడంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నారు. రెండో దశలో ప్రతి జిల్లా నుంచి నలుగురు నుంచి ఐదుగురు చొప్పున వీఎల్‌ఈలను ఎంపిక చేశారు. డిజిటల్ మార్కెటింగ్‌పై ప్రాథమిక అవగాహన, ఆసక్తి, స్థానిక వ్యాపారులతో సమర్థంగా సంప్రదించే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేపట్టారు. శిక్షణ పొందిన వీఎల్‌ఈలు తమ జిల్లాల్లో ‘డిజిటల్ బిజినెస్ అంబాసిడర్లుగా’ పని చేస్తారు. స్థానిక వ్యాపార అవసరాలను గుర్తించడం, డిజిటల్ మార్కెటింగ్ ప్రయోజనాలను వివరించడం, ప్రకటనల రూపకల్పనలో సహకరించడం, సరైన లక్ష్య వినియోగదారులను గుర్తించడం వంటి సేవలను అందిస్తారు. వ్యాపార విస్తరణలోనూ నిరంతర సహకారం అందించనున్నారు.

మెటాతో ఎంవోయూ

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ (ఈఎస్‌డీ), ఐటీ అండ్‌ సీ శాఖ, మెటా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో మీ సేవా డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమంలో రెండు సంస్థల భాగస్వామ్యం అధికారికంగా ప్రారంభమైంది.

కొత్త పోర్టల్‌, హెల్ప్‌లైన్‌ ప్రారంభం

* స్థానిక వ్యాపారులు మీ సేవా ద్వారా నేరుగా డిజిటల్ మార్కెటింగ్ సాయం కోరేలా కొత్త సదుపాయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

* పోర్టల్‌: meeseva.telangana.gov.in

* టోల్‌ఫ్రీ నెంబర్లు: 1100 / 1800-425-1110

ఈ సేవతో వ్యాపారులకు అందుబాటు ధరల్లో డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలు లభిస్తాయి. వినియోగదారులు తమ ప్రాంతంలోని ఉత్పత్తులు, సేవలను సులభంగా గుర్తించగలుగుతారు. వీఎల్‌ఈలకు అదనపు ఆదాయ మార్గం ఏర్పడుతుంది. రాష్ట్రంలో డిజిటల్ వ్యాపార వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

శిక్షణ పొందిన ప్రతి వీఎల్‌ఈ తొలుత ఒక వ్యాపారంతో పని ప్రారంభించి, ఆ తర్వాత పది, వంద వ్యాపారాలకు సేవలను విస్తరించేలా ముందుకు సాగాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి జిల్లాలో శిక్షణ పొందిన డిజిటల్ మార్కెటింగ్ వీఎల్‌ఈలు అందుబాటులో ఉండాలన్నది లక్ష్యమని వెల్లడించింది. ప్రతి స్థానిక వ్యాపారికి తక్కువ వ్యయంతో డిజిటల్ ప్రచార సాయం అందుబాటులోకి తేవాలని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం అమలులో భాగస్వాములైన ఈఎస్‌డీ-మీ సేవా బృందం, మెటా ప్రతినిధులు, వీఎల్‌ఈల సేవలను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు.

#Sridhar Babu#Mee Seva Centres#Digital Marketing Hubs#Meta#Telangana#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తర్వాత చదవండి