గుండెలో ఒక్కసారిగా దడ రావడం.. వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించడం.. మధ్యలో బీట్ మిస్ అయినట్టుగా లేదా గుండె ఫ్లట్టర్ అవుతున్నట్టుగా అనిపించడం చాలామందికి ఎదురయ్యే సమస్య. వైద్య పరిభాషలో దీన్ని హార్ట్ పాల్పిటేషన్స్ అంటారు. ఇది ఒక లక్షణం మాత్రమే.. ప్రత్యేకమైన వ్యాధి కాదు. చాలాసార్లు ప్రమాదకరం కాకపోయినా, తరచూ వస్తుంటే కారణాన్ని గుర్తించడం అవసరమని నిపుణులు అంటున్నారు.
ఇక ఆరోగ్య నిపుణుల ప్రకారం గుండెలో దడకు మొదటి కారణాల్లో ఒత్తిడి, ఆందోళన, భయం, పానిక్ వంటి భావోద్వేగ పరిస్థితులు ఉంటాయి. నిద్ర సరిగా లేకపోవడం, అధికంగా వ్యాయామం చేయడం, శరీరంలో నీరు తగ్గడం కూడా గుండె వేగాన్ని పెంచవచ్చు. కెఫీన్, నికోటిన్, ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ వంటి పదార్థాలు కొందరిలో పాల్పిటేషన్స్‌ను ప్రేరేపించవచ్చు. కొన్ని జలుబు మందులు, ఆస్తమా లేదా ఇతర మందులు కూడా కారణం కావచ్చని పేర్కొంటున్నారు.
అంతేకాదు.. రక్తహీనత, థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉండటం, శరీరంలోని పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లలో మార్పులు కూడా గుండె దడకు కారణం కావచ్చు. ఇక ఆడవారిలో గర్భధారణ, మెనోపాజ్ వంటి హార్మోన్ల మార్పుల సమయంలో కూడా కొందరికి ఈ సమస్య కనిపిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
మరో ముఖ్యమైన కారణం గుండె రిథమ్‌లో మార్పులు.. అంటే అరిత్మియా. గుండె చాలా వేగంగా, చాలా నెమ్మదిగా లేదా క్రమం తప్పకుండా కాకుండా కొట్టుకోవడం వల్ల దడ, ఫ్లట్టరింగ్, తల తిరగడం వంటి లక్షణాలు రావచ్చు. అయితే దడ వచ్చిందని వెంటనే అరిత్మియా ఉందని నిర్ణయించకూడదు. కారణాన్ని వైద్య పరీక్షల ద్వారానే నిర్ధారించాలి.
అందుకే దడ తరచూ వస్తుంటే, కొన్ని నిమిషాలకంటే ఎక్కువసేపు కొనసాగితే లేదా రోజురోజుకూ పెరుగుతుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అవసరాన్ని బట్టి ECG, రక్తపరీక్షలు, థైరాయిడ్, ఎలక్ట్రోలైట్స్, రక్తహీనత వంటి అంశాలను పరీక్షించవచ్చని సూచిస్తున్నారు.
అయితే గుండె దడతో పాటు ఛాతినొప్పి లేదా ఒత్తిడి, తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, స్పృహ కోల్పోవడం లేదా మూర్ఛ వచ్చే భావన ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
కాబట్టి అప్పుడప్పుడు వచ్చే స్వల్ప దడను చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ పదేపదే వస్తున్న గుండె దడను మాత్రం నిర్లక్ష్యం చేయకుండా.. దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడమే ఆరోగ్యానికి సురక్షితమైన మార్గం.
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..










