అరికాళ్లు మంటగా అనిపించడం.. చాలామంది సాధారణ సమస్యగానే తీసుకుంటారు. కానీ ఈ మంట తరచూ వస్తుంటే, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువగా అనిపిస్తుంటే.. దాని వెనుక కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. వైద్య నిపుణుల ప్రకారం, అరికాళ్లలో మంటకు ప్రధాన కారణాల్లో ఒకటి పెరిఫెరల్ న్యూరోపతి.. అంటే చేతులు, కాళ్లలోని నరాలు దెబ్బతినడం. ఈ సమస్యలో మంటతో పాటు తిమ్మిరి, సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, నొప్పి లేదా స్పర్శ తగ్గడం కూడా ఉండొచ్చు.
ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే నరాలు దెబ్బతిని అరికాళ్లలో మంట, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే మంటతో పాటు పాదాల్లో స్పర్శ తగ్గడం, చిన్న గాయాలు కూడా తెలియకపోవడం ఉంటే నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు.
ఇక విటమిన్ బి12 వంటి కొన్ని విటమిన్ల లోపం, థైరాయిడ్ పనితీరు తగ్గడం, కిడ్నీ లేదా లివర్ సంబంధిత సమస్యలు, అధికంగా మద్యం తీసుకోవడం, కొన్ని మందుల దుష్ప్రభావాలు కూడా నరాల దెబ్బతినడానికి కారణమవుతాయని చెబుతున్నారు.
అయితే ప్రతి అరికాలి మంటా నరాల సమస్యే అనుకోవాల్సిన అవసరం లేదు. పాదాల్లో చెమట ఎక్కువగా ఉండటం, ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా అథ్లెట్స్ ఫుట్ వల్ల కూడా మంట, దురద, చర్మం పొలుసులుగా ఊడటం, పగుళ్లు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే మంట పదేపదే వస్తుంటే లేదా రోజురోజుకూ పెరుగుతుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అవసరాన్ని బట్టి రక్తంలో చక్కెర, విటమిన్ బి12 వంటి పరీక్షలు చేసి కారణాన్ని గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా మంటతో పాటు పాదాల్లో స్పర్శ తగ్గడం, గాయం లేదా పుండ్లు, వాపు, ఇన్ఫెక్షన్, లేదా మంట కాళ్లపైకి వ్యాపించడం కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవాలి. కారణాన్ని గుర్తించి చికిత్స చేయడమే సమస్యను మరింత తీవ్రం కాకుండా కాపాడే మార్గం అని వెల్లడిస్తున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..











