ఈ భౌతిక ప్రపంచంలో మనిషి అనుభవించే ప్రతి సుఖం వెనుక ఒక కోరిక ఉంటుంది.. ప్రతి దుఃఖం వెనుక ఒక బంధం ఉంటుంది. నేను అనే భావన బలపడిన కొద్దీ, జీవుడు తన అసలు స్వరూపానికి దూరమవుతాడు. తాను ఈ శరీరం కాదని, పరమాత్మతో నిత్య సంబంధం కలిగిన జీవాత్మనని మరచిపోయిన క్షణం నుంచే మాయా బంధం మొదలవుతుంది.
శ్రీకృష్ణ తత్త్వం ప్రకారం జీవాత్మ భౌతిక ప్రకృతిలో పుట్టింది కాదు. అది కృష్ణుని పరాశక్తికి చెందిన నిత్యమైన అణు స్వరూపం. కానీ కృష్ణుని పట్ల విముఖత కలిగినప్పుడు, భౌతిక ప్రకృతి జీవుడిని తన గుణాలతో ఆవరించుకుంటుంది. అప్పుడు నేనే భోక్తను.. నేనే కర్తను.. నేనే నియంత్రకుడిని అనే అహంకారం అతడి చైతన్యాన్ని కప్పివేస్తుంది. అదే బంధనానికి మూలం.. అదే భౌతిక దుఃఖానికి కారణం.
బాధకు మూలం కేవలం భౌతిక శరీరం కాదు.. కృష్ణుని నుంచి దూరమై, భౌతిక ప్రకృతిని తన ఇంద్రియ సుఖాల కోసం అనుభవించాలనే కోరిక. అహంకారం ఇక్కడే మొదలవుతుంది. నేనే కర్తను.. నేనే భోక్తను.. ఇది నాది అనే భావన జీవుడిని కర్మబంధంలోకి నెడుతుంది. దాని ఫలితంగా జననం, మరణం, సుఖం, దుఃఖం అనే ద్వంద్వాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జీవుడిని నిందించడం కాదు.. అతని స్వేచ్ఛా సంకల్పం ఎటువైపు మళ్లిందో అర్థం చేసుకోవడం ముఖ్యం.
అయితే ఈ బంధానికి విముక్తి మార్గం కూడా శ్రీకృష్ణుడే చూపించాడు. తనను శరణాగతి చేసి, ప్రేమతో భక్తి సేవలో నిమగ్నమైనప్పుడు జీవుడు తన అసలు స్వరూపాన్ని తిరిగి పొందుతాడు. కృష్ణుని సేవలోనే జీవాత్మకు సహజమైన ఆనందం ఉందని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. ఇక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మలు అనంతమా? పరిమితమా? అనే ప్రశ్నకు మన మేధస్సుతో పూర్తిస్థాయి సమాధానం కనుగొనడం సాధ్యం కాదు.
ఎందుకంటే పరమాత్మ శక్తి అచింత్యమైనది. మన పరిమిత బుద్ధికి అందని ఆధ్యాత్మిక తత్త్వంలో, మనకు విరుద్ధంగా కనిపించే విషయాలు కూడా పరస్పర విరోధం లేకుండా సహజీవనం చేయగలవు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన అచింత్య శక్తిని వివరిస్తూ, సమస్తం తనలో ఉన్నప్పటికీ తాను వాటిచే పరిమితం కాదని తెలియజేస్తాడు. ఇదే అచింత్య శక్తి తత్త్వం.
అందుకే ఆధ్యాత్మిక జ్ఞానానికి అంతిమ లక్ష్యం ప్రతి విషయాన్నీ మేధస్సుతో జయించడం కాదు.. మన పరిమితిని అంగీకరించి, అనంతుడైన శ్రీకృష్ణుని శరణు పొందడం. కృష్ణుని నుంచి దూరం కావడమే బంధానికి ఆరంభమైతే.. కృష్ణుని పట్ల ప్రేమ, భక్తి, శరణాగతే విముక్తికి మార్గం అని ఆథ్యాత్మిక గ్రంధాలు బోధిస్తాయి..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












