తెలంగాణ

నల్లమల పులి కాదు.. చంద్రబాబు సంకలో పిల్లి- సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్

రచన: NK6 నిమిషాల పఠనం

Ktr: రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వల్ల జూరాల ఆయకట్టు ఆగమయ్యే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఏపీ కృష్ణా నీళ్ళు దోచుకుంటోందని ఆరోపించారు.

Ktr: రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వల్ల జూరాల ఆయకట్టు ఆగమయ్యే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఏపీ కృష్ణా నీళ్ళు దోచుకుంటోందని ఆరోపించారు. పాలమూరు బిడ్డ పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టారని సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో సబ్ స్టేషన్ నుండి సుభాష్ చౌరస్తా వరకు ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

గుమ్మడం, పెబ్బేరు సబ్ స్టేషన్ కి వెళ్లామని.. ఐదారు గంటలు కూడా కరెంట్ సరిగా రావడం లేదని రైతులు చెబుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఓవైపు 12 గంటలు విద్యుత్ ఇస్తున్నామని అధికారులు చెబుతుంటే.. మరోవైపు ఒక్కో రోజు 10 నుంచి 12 సార్లు కరెంట్ పోతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అంటూ విరుచుకుపడ్డారు. పాత రోజులు తెస్తానని చెప్పి మరీ తీసుకొచ్చాడని ధ్వజమెత్తారు. స్టార్టర్లు, మోటర్లు కాలిపోవడం.. విద్యుత్ కోతలు.. ఇలా పాత రోజులు గుర్తుకు తెచ్చాడని విమర్శించారు.

''248 టీఎంసీలు కృష్ణా నదికి వచ్చాయి. జూరాల కింద మొత్తం 18 టీఎంసీలు ఇచ్చారు. కల్వకుర్తి పంప్ లు ఆన్ చేయలేదు. మూడు కూడా నడపక లేకపోతున్నారు. కల్వకుర్తి కింద 10 టీఎంసీలకు మించి నీళ్ళు ఇవ్వలేదు. జూరాల కింద లక్ష పది వేల ఎకరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరా ఎండినా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం. ప్రభుత్వానికి నీళ్ళు ఇవ్వాలని శ్రద్ధ లేదు.

మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారు. రైతు బీమా ప్రీమియం కట్టకుండా రైతులను ఆగం చేశారు. మోసపోతే గోస పడతామని కేసీఆర్ చెప్పిన మాటలు నిజం అయ్యాయి. సీఎం సొంత ఊరు రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కారు. సీఎంకు కరెంట్ ఇచ్చే తెలివి లేక రైతులను ఇబ్బంది పెడుతున్నారు. శ్రీశైలం నుండి సీఎం రేవంత్ గురువు చంద్రబాబు యధేచ్ఛగా నీళ్ళు దోచుకుంటున్నారు. కేసీఆర్ పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తి చేశాం. కేసీఆర్ కి పేరు వస్తుందని రేవంత్ రెడ్డి మిగిలిన పనులు చేయట్లేదు. పాలమూరు రైతులను సీఎం రేవంత్ తొక్కుతున్నారు. పెబ్బేరులో వెయ్యి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారు.

రైతు ప్రయోజనాలే ముఖ్యంగా రైతుల కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుంది. రేవంత్ రెడ్డి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి రైతుల కోసం నీళ్ళు విడుదల చేయాలి. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు చంద్రబాబు సంకలో పిల్లి'' అంటూ విరుచుకుపడ్డారు కేటీఆర్.

''పాలమూరు బిడ్డ పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టి నీళ్లు కిందికి వదిలారు. గురుదక్షిణ కింది పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి నీళ్లు వదిలారు. వర్షాలకు కృష్ణా నదిలోకి 248 టీఎంసీల నీళ్లు వచ్చాయి. కానీ, జూరాల ఆయకట్టు ఎండిపోయే పరిస్థితి ఉంది. కల్వకుర్తి మోటార్లను ఎందుకు ఆపేశారు? కేసీఆర్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. 7 లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత కేసీఆర్ ది. చెరువుల్లో ఎప్పటికప్పుడు నీళ్లు నింపాం. అపారంగా చెక్ డ్యామ్ లు కట్టి నీళ్ల బాధ లేకుండా చేశాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను 90శాతం పూర్తి చేశాం.

నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉన్నా ఇవ్వలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిది. 6 గంటలకు మించి కరెంట్ రావడం లేదని రైతులు చెబుతున్నారు. మోటర్లు కాలిపోతున్నాయి.. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు ఇవ్వకపోతే నష్టానికి బాధ్యులెవరు?

ఎల్ నినో ఒక్క తెలంగాణలోనే ఉందా? కర్నాటక, ఏపీలో లేదా? ఎల్ నినో పేరుతో తప్పించుకోవాలని చూస్తే రేవంత్ రెడ్డిని వదిలేది లేదు. ఏడాదిన్నర తర్వాత కేసీఆర్ వస్తారు.. అప్పుడు రైతుల కష్టాలన్నీ తీరుతాయి'' అని కేటీఆర్ అన్నారు.

#Ktr#Brs#Jurala#Farmers#Water#Cm Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి