BJP Silence: తెలంగాణ గడ్డపై ప్రస్తుతం రాజకీయం మొత్తం రియల్ ఎస్టేట్, భూ దందాల చుట్టూనే రౌండ్లు కొడుతోంది. ఎర్రవల్లి ల్యాండ్ ఇష్యూ నుంచి హైదరాబాద్ శివారుల్లోని వేల కోట్ల విలువైన ఆస్తుల వరకు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ప్రతిరోజూ మీడియా ముఖంగా ప్రెస్‌మీట్లు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో పతాక శీర్షికలు దక్కించుకునేందుకు ఈ రెండు పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. అయితే ఈ రణరంగంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్న ‘అంతుచిక్కని మౌనం’ వెనుక కారణాలు ఏంటో సొంత పార్టీ క్యాడర్‌కే అర్థం కావడం లేదు. అయితే రాజకీయ వర్గాలు మాత్రం కాషాయ దళం మౌనం వెనక పెను రాజకీయ విస్ఫోటనం దాగి ఉందని అభిప్రాయపడుతున్నారు.
మైక్ వార్ వర్సెస్ మైండ్ గేమ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ రోజూవారీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ ప్రజల్లో ఒకరిని మించి మరొకరు నిందలు వేసుకుంటుంటే.. కాషాయ పార్టీ మాత్రం ఈ రొంపిలోకి నేరుగా దిగకుండా వ్యూహాత్మకంగా సైలెంట్ అయింది. ఎర్రవల్లి రీ-సర్వే లొల్లిలో ఇరువర్గాల వాదనలను గమనిస్తూ, కాంగ్రెస్ - గులాబీ పార్టీలు రెండూ ఒకరి అక్రమాలను మరొకరు బయటపెట్టుకునే వరకు బీజేపీ వెయిట్ చేద్దాం అనే ధోరణి ఉన్నట్లు కనిపిస్తోంది. రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న భూ ఆరోపణల వల్ల అంతిమంగా ప్రజల్లో వారిద్దరి విశ్వసనీయత అడుగంటిపోతుందనేది కమలం పార్టీ లెక్క అని అంటున్నారు.
ఆధారాలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల టేబుల్‌పైకి
ఈ మౌనం కేవలం ఉపేక్ష కాదు.. పక్కా గ్రౌండ్ వర్క్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రోజువారీ మైలేజ్ కోసం కేవలం విలేకరుల సమావేశాలకు పరిమితమవుతుంటే, కమలనాథులు మాత్రం పాత కాస్రా, సిత్వార్ రికార్డులు, అక్రమ రిజిస్ట్రేషన్లు, బినామీ వ్యవహారాలకు సంబంధించిన పక్కా ఆధారాలను రహస్యంగా సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. సరైన సమయం చూసి ముఖ్యంగా ఎన్నికల ముంగిట ఈ భూ కుంభకోణాలపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించేలా భారీ ప్లాన్ సిద్ధమవుతోందన్న ప్రచారం జోరందుకుంది.
'మేం వేరు.. వాళ్లిద్దరూ ఒక్కటే'
ఈ భూముల గొడవల్లో ఆ రెండు పార్టీలు బజారున పడ్డాక, "తెలంగాణను కొల్లగొట్టడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు.. మా పార్టీ ఒక్కటే నిజమైన ప్రత్యామ్నాయం" అంటూ క్లీన్ ఇమేజ్‌తో బరిలోకి దిగాలన్నది కమలదళం అసలు ఎత్తుగడ అనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం రోజువారీ టీవీ డిబేట్లలో ఉపన్యాసాలతో ఊదరగొడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకవైపు కనిపిస్తుంటే.. తెరవెనుక కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా కదుపుతున్న పావులు ఎవరి మెడకు చుట్టుకోనున్నాయన్న ఉత్కంఠ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఏది ఏమైనా అగ్ర నాయకత్వం సైలెంట్ గురించి పార్టీ క్యాడర్‌కి సరైన అవగాహన ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం బీజేపీ అగ్ర నాయకత్వంపైనే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీ శ్రేణుల్లో ఈ అంశంపై క్లారిటీ లేకపోతే వారు నైరాశ్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యూహాత్మక మౌనం బీజేపీకి కలిసి వస్తుందా లేదంటే చేటు చేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.









