తెలంగాణ

KCR: ఫాంహౌస్ లో కబ్జా ఆరోపణలు.. కేసీఆర్ మౌనంతో మరింత డ్యామేజ్..?

రచన: Mahesh4 నిమిషాల పఠనం

KCR: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు గజ్వేల్ వైపు మళ్లింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కంచుకోట లాంటి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం చుట్టూ భూ ఆక్రమణ వివాదం ముసురుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది

KCR: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు గజ్వేల్ వైపు మళ్లింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కంచుకోట లాంటి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం చుట్టూ భూ ఆక్రమణ వివాదం ముసురుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ, అసైన్డ్ భూములతో పాటు సమీప చెరువులు, కాలువల స్థలాలను ఫాంహౌస్ కోసం కబ్జా చేశారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలు ముమ్మరం చేస్తుండగా, వివాదం కేంద్రంలో ఉన్న కేసీఆర్ మాత్రం పెదవి విప్పకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

హైదరాబాద్ పరిసరాల్లో చెరువుల పరిరక్షణ పేరుతో 'హైడ్రా' పేల్చిన బాంబులు ఇప్పటికే బడా నేతల్లో గుబులు రేపాయి. ఇప్పుడు ఆ రగడ ఏకంగా కేసీఆర్ వ్యక్తిగత అడ్డా అయిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ హద్దుల వరకు చేరింది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సర్వే నిర్వహించి, అతి తర్వలో ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఒకవేళ ఎర్రవల్లి ఫాంహౌస్ కోసం భూములు ఆక్రమణకు గురైనట్లు తేలితే ఏమాత్రం ఉపేక్షించబోమని ఇప్పటికే అధికార పక్షం స్పష్టం చేసింది.

కొత్త గుబులు పుట్టిస్తున్న కేసీఆర్ మౌనం..

ఇలాంటి టైంలో కేసీఆర్ అనుసరిస్తున్న నిశ్శబ్దం పార్టీ వర్గాల్లో కొత్త గుబులును పుట్టిస్తోంది. ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగేందుకు అధినేత నుంచి సరైన మార్గదర్శకత్వం అందక క్షేత్రస్థాయి కేడర్ ఆత్మరక్షణలో పడిపోతోంది. వ్యక్తిగతంగా వచ్చిన ఇంతటి తీవ్రమైన ఆరోపణలను స్వయంగా కేసీఆర్ ఖండించకపోవడం వల్ల, సాధారణ ప్రజల్లో పార్టీ పట్ల నెగెటివ్ ఇంపాక్ట్ పడుతోందన్న భావన సామన్య కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది.

ఈ చర్యలను కేటీఆర్, హరీశ్ రావులు.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ కక్షసాధింపు అంటూ తిప్పికొడుతున్నా, గులాబీ బాస్ కేసీఆర్ స్వరం బయటకు రాకపోవడంతో అధికార పక్షం విమర్శలకు బలం చేకూరుస్తుందనే వాదన వినిపిస్తుంది.

ఈ మౌనం వెనుక కేసీఆర్ పెద్ద వ్యూహాన్నే రచిస్తున్నారని ఆయన అత్యంత సన్నిహితులు పేర్కొంటున్నారు. కావాలనే ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఈ వ్యక్తిగత వివాదంపై ముందే స్పందించి దానికి మరింత హైప్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆయన సంయమనం పాటిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే రోజురోజుకూ బీఆర్ఎస్ పార్టీపైన, గులాబీ బాస్‌పైన పెరుగుతున్న ఈ రాజకీయ దాడి అధినేతను మౌనం వీడేలా చేస్తుందా లేక పార్టీ భవిష్యత్తుపై మరింత ప్రభావం చూపుతుందా అన్నది కాలమే తేల్చాలి.

#KCR#K Chandrashekar Rao#Telangana#BRS#BRS Party#Gajwel#Erravelli Farmhouse#KCR Farmhouse#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి