Pan India Cinema: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ నుంచి మన సౌత్‌లో పాన్ ఇండియా సినిమాల ప్రభావం ఎక్కువైంది. దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి లాభాలు కూడా ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. అయితే దీన్ని కేవలం “లాభం” లేదా “నష్టం”గా కాకుండా, ఇండస్ట్రీలో వచ్చిన ఒక పెద్ద మార్పుగా కూడా చూడవచ్చు.
పాన్ ఇండియా సినిమాల వల్ల లాభాలు:
1. మార్కెట్ విస్తరించింది..
ఒక ప్రాంతానికే పరిమితమైన సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్కేల్ కారణంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను ఒకేసారి చేరుకోగలుగుతోంది. దీంతో నిర్మాతలకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. కథ గనక యూనిక్‌గా ఉంటే..అన్నీ భాషల నుంచి భారీ వసూళ్ళు రాబట్టవచ్చు.
2. తెలుగు సినిమాకు దేశవ్యాప్త గుర్తింపు..
బాహుబలి, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ వంటి సినిమాల విజయంతో దక్షిణాది సినిమాలపై ఇతర భాషల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా, మన తెలుగులో రాజమౌళి రూపొందించిన సినిమాల వల్ల బాలీవుడ్ మాత్రమే కాకుండా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఆశ్చర్యపోయేలా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
3. బడ్జెట్లు పెరిగే అవకాశం..
ఈ నేపథ్యంలో మార్కెట్ పెద్దదవడంతో భారీ నిర్మాణాలకు పెట్టుబడులు పెట్టే అవకాశం పెరిగింది. అంతర్జాతీయ స్థాయి యాక్షన్, వీఎఫెక్స్, ప్రొడక్షన్ డిజైన్ వంటి అంశాలపై ఎక్కువగా ఖర్చు చేయగలుగుతున్నారు.
4. నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు..
పాన్ ఇండియా సినిమా రావడం వల్ల వివిధ భాషల నటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, టెక్నీషియన్లు కలిసి పనిచేసే అవకాశాలు పెరిగాయి. దాంతో, ఇతర భాషల నటీనటుల క్రేజ్ తో థియేటర్స్ రన్ కూడా పెరుగుతుంది..ఆక్యుపెన్సీ ఎక్కువవుతుంది.
ఇక నష్టాలు, సమస్యలు చూస్తే:
1. ప్రతి సినిమాను పాన్ ఇండియాగా చేయాలనే ఒత్తిడి..
కథకు అవసరం లేకపోయినా భారీ బడ్జెట్, ఇతర భాషల్లో విడుదల చేఅలనేటువంటి అంశాలను జోడించడం వల్ల రిస్క్ బాగా పెరుగుతుంది. రీజనల్ కథను కూడా మల్టీ లాంగ్వేజస్‌లో తీస్తే అక్కడి కల్చర్ వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోకపోతే నష్టాలు తప్పవు.
2. బడ్జెట్ పెరగడం
మార్కెట్ పెరిగినంత మాత్రాన సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే గ్యారెంటీ లేదు. కథకి సరిపోయే బడ్జెట్ కాకుండా అనవసరంగా భారీ బడ్జెట్ తో తీస్తే ఆ సినిమా విఫలమైతే నష్టం కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి సినిమా ఒక్కటి ఫ్లాపైతే..నిర్మాత కోలుకునే పరిస్థితి దాదాపు అసాధ్యం.
3. స్థానిక కథలపై ప్రభావం..
పాన్ ఇండియా మార్కెట్ కోసం కథను రూపొందించే క్రమంలో స్థానిక సంస్కృతి, ప్రాంతీయ కథన శైలి తగ్గిపోవచ్చనే అభిప్రాయం ఉంది. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కొన్ని కథలు అన్నీ భాషల ప్రేక్షకులను మెప్పించలేకపోవచ్చు. కొన్నీఅర్లు రీజినల్ కథే అందరికీ నచ్చొచ్చు. ఏదేమైనా, కథలో సోల్ చాలా ముఖ్యం.
4. ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి..
ప్రతి సినిమాలో భారీ యాక్షన్, విజువల్స్, స్టార్ కాస్ట్ ఉండాలని ప్రేక్షకులు ఆశించే పరిస్థితి ఏర్పడితే చిన్న, కంటెంట్ ఆధారిత సినిమాలకు థియేట్రికల్ మార్కెట్ కష్టమయ్యే అవకాశం ఉంది. అయితే, ఇది అన్నీ సందర్భాలలో అని చెప్పలేము. కోర్ట్ లాంటి సినిమా..ఏ భాషలోనైనా ఆడుతుంది. అంతకముందు వచ్చిన పింక్ కథ కూడా తమిళ, తెలుగు భాషలలో హిట్ సాధించింది.
అసలు విషయం ఏమిటంటే?
“పాన్ ఇండియా” అనేది ఒక భాష నుంచి మరో భాషకు సినిమా తీసుకెళ్లే మార్కెటింగ్ పద్ధతి మాత్రమే కాకుండా, భారతీయ సినిమా మార్కెట్‌ను ఒక పెద్ద మార్కెట్‌గా మార్చిన పరిణామం. కానీ, ప్రతి కథను పాన్ ఇండియా స్థాయిలో చెప్పాలనుకుంటే ప్రమాదం తప్పదు.










