వ్యాపారం

Hyderabad: ప్రపంచ నగరాల్లో భారత్ దూకుడు.. హైదరాబాద్‌కు కీలక స్థానం!..

రచన: Venu6 నిమిషాల పఠనం

2050 నాటికి హైదరాబాద్ మరింత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశముందని, అంతర్జాతీయ నగరాల సూచీలో 58వ స్థానానికి చేరుకుంటుందని తెలిపింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్‌-100 నగరాల ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం నుంచి ఏకంగా 55 నగరాలు చోటు దక్కించుకోవడం విశేషం.

భారత్‌ ఆర్థిక ప్రగతిలో నగరాల పాత్ర రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలోని మెట్రో నగరాలు కేవలం జనాభా కేంద్రాలుగానే కాకుండా.. పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలు, టెక్నాలజీ, మానవ వనరులకు ప్రధాన కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ విడుదల చేసిన 2026 గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ కూడా ఇదే ధోరణిని స్పష్టం చేస్తోంది.

ప్రపంచంలోని వెయ్యి ప్రధాన నగరాలను ఆర్థిక వ్యవస్థ, మానవ వనరులు, జీవన నాణ్యత, పర్యావరణం, పరిపాలన అనే ఐదు అంశాల ఆధారంగా ఈ సూచీ అంచనా వేసింది. ఇందులో ప్రస్తుత పరిస్థితులతో పాటు.. భవిష్యత్తులో నగరాల ఆర్థిక సామర్థ్యం ఎలా ఉండొచ్చన్న దానిపైనా దృష్టి పెట్టింది.

ముఖ్యంగా భారతీయ నగరాల భవిష్యత్‌ వృద్ధిపై నివేదిక ఆసక్తికరమైన అంచనాలు చేసింది. చైనా, భారత్‌ నగరాలు పెద్ద జనాభాతో పాటు ఉత్పాదకత, ఆదాయాల్లో పెరుగుదల సాధిస్తుండటంతో.. రానున్న సంవత్సరాలలో ప్రపంచ పట్టణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ పేర్కొంది.

హైదరాబాద్‌, ముంబయి, చెన్నై వంటి నగరాలు భారత ఆర్థిక వ్యవస్థకు కీలక పట్టణ కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, స్టార్టప్‌ రంగాలతో తన ఆర్థిక పరిధిని విస్తరిస్తోంది. బెంగళూరును కూడా ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీస్‌ టు వాచ్‌ జాబితాలో చేర్చింది.

అయితే నగరాల వృద్ధి కేవలం జనాభా పెరుగుదల వల్లే రావడం లేదు. ఉత్పాదకత పెరగడం, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి, కార్పొరేట్‌ కార్యకలాపాలు, విశ్వవిద్యాలయాలు, పెట్టుబడులు, టెక్నాలజీ ఆధారిత రంగాలు నగరాల ఆర్థిక శక్తిని పెంచుతున్నాయి.

అయితే భారతీయ నగరాలకు సవాళ్లు కూడా ఉన్నాయి. మౌలిక వసతులు, జీవన నాణ్యత, ఆదాయ అసమానత, పర్యావరణ పరిస్థితులు వంటి అంశాల్లో ఇంకా మెరుగుదల అవసరమని సూచీ చెబుతోంది. అంటే ఆర్థిక వృద్ధి వేగంగా ఉన్నప్పటికీ.. ఆ వృద్ధి ప్రజల జీవన ప్రమాణాల్లోనూ ప్రతిఫలించాల్సిన అవసరం ఉందన్నమాట.

ప్రపంచ స్థాయిలో చూస్తే న్యూయార్క్‌, లండన్‌, పారిస్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆసియా నగరాలు మాత్రం భవిష్యత్‌ వృద్ధికి కీలక కేంద్రాలుగా ముందుకు వస్తున్నాయి. 2050 నాటికి చైనా, భారత్‌ నగరాల ఆర్థిక ప్రాధాన్యం మరింత పెరగొచ్చని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ అంచనా వేస్తోంది.

అందుకే హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వరకు.. ముంబయి నుంచి దిల్లీ వరకు ప్రపంచ ఆర్థిక పటంలో భారత్‌ తన స్థానాన్ని ఎలా విస్తరిస్తుందన్న దానికి కీలక సూచికలుగా మారుతున్నాయి. మరోవైపు హైదరాబాద్, ముంబై, చెన్నై మహానగరాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయని, అవి అత్యంత బలమైన పట్టణ ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని 'ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌' నివేదిక వెల్లడించింది. అంచనా వేసిన జీడీపీ వృద్ధిలో హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయిలో 15వ స్థానంలో నిలిచిందని పేర్కొంది. 2050 నాటికి హైదరాబాద్ మరింత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశముందని, అంతర్జాతీయ నగరాల సూచీలో 58వ స్థానానికి చేరుకుంటుందని తెలిపింది.

అలాగే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్‌-100 నగరాల ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం నుంచి ఏకంగా 55 నగరాలు చోటు దక్కించుకోవడం విశేషం. ఇక అంతర్జాతీయ మానవ వనరుల విభాగంలో 13వ స్థానాన్ని కైవసం చేసుకున్న ఢిల్లీ.. టొరంటో, సియోల్, బీజింగ్‌ నగరాలను సైతం వెనక్కి నెట్టిందని ఆ నివేదిక వివరించింది. మొత్తానికి రానున్న కొన్ని సంవత్సరాలలో హైదరాబాద్‌ అభివృద్ధి ఊహకు అందనంత జరుగుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి..

#India#Telangana#Hyderabad#Mumbai#Chennai#Indian economy#global cities#key position
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి