నిజామాబాద్ నగరంలోని ఆర్‌ఆర్ చౌరస్తాలో సంచలనం సృష్టించిన చిత్తరి హరిబాబు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. యూట్యూబర్ వైష్ణవి సోదరుడు, ఈ హత్య కేసు ప్రధాన నిందితుడైన గంధం సంతోష్‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వైజాగ్ పారిపోయేందుకు యత్నిస్తుండగా నిజామాబాద్ బైపాస్ వద్ద రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న సమయంలో ప్రత్యేక బృందాలు పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నాయి.

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవిలది ప్రేమ వివాహం. అయితే కుటుంబ కలహాలు, అదనపు కట్నం వేధింపుల కారణంగా ఈఏడాది మార్చి 16న నాలుగు నెలల గర్భిణి అయిన వైష్ణవిని హరిబాబు దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో జైలుకు వెళ్లిన హరిబాబు జూలైలో బెయిల్‌పై బయటకు వచ్చి, నిజామాబాద్‌లోని సాయినగర్‌లో ఉంటున్న తన తల్లి వద్దకు వచ్చి మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 17న హరిబాబును లక్ష్యంగా చేసుకుని సంతోష్ కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. హత్య అనంతరం సంతోష్ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ, తన చెల్లెలిని చంపిన హరిబాబుపై ప్రతీకారం తీర్చుకున్నానని, న్యాయం కోసం వేచి చూసి విసిగిపోయి ఈ పని చేశానని ఒప్పుకున్నాడు. అయితే ఇది ఆకస్మిక దాడి కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితులు కారులో వచ్చి రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడ్డారని నిజామాబాద్ ఏసీపీ తెలిపారు.
ఈ దారుణానికి సంతోష్ తల్లి రాణి, ఆమె అక్క కుమారులు చరణ్, రంజిత్ ప్రోత్సహించారని, వారే ప్లాన్ అమలులో భాగమయ్యారని పోలీసులు విచారణలో గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ముగ్గురి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సంతోష్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.











