దేశీయ వంటగ్యాస్ (LPG) వినియోగదారులకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాయితీ(సబ్సిడీ) ధరకే వంటగ్యాస్ సిలిండర్లను పొందాలంటే 2026 అక్టోబర్ 1 నాటికి బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ (BAA) ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అర్హులైన పేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు, గృహ అవసరాల సిలిండర్లు వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు అక్రమంగా మళ్లకుండా నిరోధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
బయోమెట్రిక్ పూర్తి చేయని వారికి అక్టోబర్ 1 నుంచి రాయితీ వర్తించదని, వారు మార్కెట్ ధరకే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 90శాతం మంది (27.43 కోట్ల మంది) వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారని, వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. వినియోగదారులు సిలిండర్ డెలివరీ సమయంలో సిబ్బంది యాప్ ద్వారా, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీలో లేదా సంబంధిత ఆయిల్ కంపెనీల అధికారిక యాప్‌ల (IndianOil ONE, HelloBPCL, HP PAY) ద్వారా స్వయంగా ఈ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని సూచించింది.
ప్రస్తుతం 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌పై సుమారు రూ.210వరకు సబ్సిడీ లభిస్తోందని, ఈ వెసులుబాటు సక్రమంగా నిర్వహించడానికే ఈ ఆధార్ అనుసంధానం అత్యవసరమని ప్రభుత్వం వివరించింది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల వద్ద రద్దీని నివారించేందుకు డెలివరీ బాయ్స్ ద్వారా ఇంటి వద్దకే బయోమెట్రిక్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు.
అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్ కలిగిన వినియోగదారులు 'ఆధార్ ఫేస్ ఆర్‌డీ (Aadhaar FaceRD)' యాప్ సాయంతో తమ ముఖాన్ని స్కాన్ (Face Recognition) చేసి, డిజిటల్‌గా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. నిర్ణీత గడువు లోపు ఆధార్ ప్రామాణీకరణ పూర్తి చేయకపోతే సబ్సిడీ సొమ్ము తాత్కాలికంగా నిలిచిపోతుందని, తిరిగి ఈ-కేవైసీ పూర్తి చేసిన వెంటనే యథావిధిగా సబ్సిడీ ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.












