తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో.. ఇప్పుడు రాజకీయ వర్గాల దృష్టి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పడింది. దీంతో దానం కేసు తీర్పు కడియం పై ఎంతవరకు ప్రభావం చూపుతుంది అన్నది ఉత్కంఠంగా మారింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ-ఫామ్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. అదే సమయంలో ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ లోక్‌సభ బరిలో నిలిచారు. ఈ పరిణామాలే ఇప్పుడు ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్‌లో కీలక అంశాలుగా మారినట్టు ప్రచారం జరుగుతుంది.
మరోవైపు కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా.. తన కుమార్తె తరఫున కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, కాంగ్రెస్ కండువాతో బహిరంగ కార్యక్రమాల్లో కనిపించారని బీఆర్ఎస్ తరఫున వాదనలు ఉన్నాయి. అంతేకాదు.. కావ్య నామినేషన్ ప్రక్రియకు సంబంధించి శ్రీహరి సంతకం చేశారనే అంశాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించినట్లు కోర్టు రికార్డుల్లో నమోదైంది.
అలాగే 2024లో కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరినట్లు, ఆయనతో పాటు ఆయన కుమార్తె కూడా కాంగ్రెస్‌లో చేరిన ఘటనపై అప్పటి కోర్టు విచారణలో వివరాలు నమోదయ్యాయి. మరోవైపు దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి, కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అంశాన్ని హైకోర్టు పరిశీలించింది. 2026 సెప్టెంబర్ 18న అనర్హత వేటు వేస్తూ.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది.
అయితే కడియం కేసులో పరిస్థితి కూడా ఇలాగే ఉందనే ప్రచారాన్ని బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నారు.. అలాగే న్యాయపరంగా చూసుకుంటే.. కడియం కేసులో కూడా ఆయన కాంగ్రెస్‌లో చేరిన విధానం, ఆ తర్వాత చేసిన రాజకీయ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంలో ఆయన పాత్ర వంటి అంశాలు కీలకం కానున్నాయని తెలుస్తుంది.
ఇక రాజకీయంగా చూస్తే... 2023లో ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ఆ తర్వాత మరో పార్టీకి మారిన ఎమ్మెల్యేల భవిష్యత్తుపై తెలంగాణలో కొనసాగుతున్న పెద్ద రాజకీయ, న్యాయ చర్చలో ఇది మరో కీలక అధ్యాయం.. ఇప్పటికే కడియం శ్రీహరిపై అనర్హత చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. అందుకే ఇప్పుడు స్టేషన్‌ఘన్‌పూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి..
ఇక ఎమ్మెల్యేల పార్టీ మార్పులపై మొదటి నుంచి తీవ్రంగా స్పందిస్తూ.. అనర్హత వేటు కోసం కోర్టులను ఆశ్రయించిన బీఆర్ఎస్‌కు దానం నాగేందర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఒక కీలక పరిణామంగా మారింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మాత్రం బీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఒకవైపు కోర్టుల్లో ఫిరాయింపులపై న్యాయపోరాటం కొనసాగుతుండగా.. మరోవైపు ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి రాజకీయ సవాళ్లు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అలాగే దానం నాగేందర్ కేసులో హైకోర్టు తీర్పు తర్వాత ఇతర ఫిరాయింపు కేసులపై కూడా ఆసక్తి పెరిగింది. ఇప్పటికే కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు తదుపరి దశకు చేరితే.. ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర రాజకీయ సమీకరణాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో న్యాయస్థానాల పరిశీలన ఏ దిశగా సాగుతుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే బీఆర్ఎస్ కోర్టులో సాధించే న్యాయపరమైన ఫలితాన్ని ప్రజాక్షేత్రంలో రాజకీయ బలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫిరాయింపుల అంశాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్తుందన్నదే ఆ పార్టీ రాజకీయ వ్యూహానికి కీలకంగా మారనుంది. మరి బీఆర్ఎస్ ఇందులో విజయం సాధిస్తుందా.. మళ్ళీ చతికిలపడి పరువు పోగొట్టుకుంటుందా అనేడు చూడాలి..










