బొప్పాయి అంటే కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు.. మన శరీరానికి అవసరమైన పోషకాలు అందించే పండు. అయితే.. ఏ ఆహారమైనా అందరికీ ఒకేలా ఉపయోగపడదు. మరి బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎవరు దీనిని జాగ్రత్తగా తినాలి?
బొప్పాయిలో విటమిన్ C, విటమిన్ A, ఫైబర్, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్.. ప్రోటీన్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. అందుకే మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి పండిన బొప్పాయి కొంతవరకు ఉపయోగపడవచ్చు. ఇందులోని ఫైబర్ కూడా ప్రేగుల కదలికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బొప్పాయిలో ఉండే విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్ A కంటికి, చర్మ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే బొప్పాయి తింటే చర్మం తెల్లగా మారిపోతుందా?. వ్యాధులు నయం అవుతాయా? అని ఆశపడటం సరైనది కాదు. కానీ బరువు తగ్గాలనుకునేవారికి బొప్పాయి కొంతవరకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే ఇది సాధారణంగా తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు, కొంత ఫైబర్ కలిగి ఉంటుంది. కానీ బొప్పాయి మాత్రమే తింటే బరువు తగ్గిపోతారని అనుకోవడం తప్పు. సమతుల్య ఆహారం, వ్యాయామం కూడా అవసరం. ముఖ్యంగా గర్భిణీలు పచ్చి లేదా సగం పండిన బొప్పాయిని అధికంగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పచ్చి బొప్పాయిలో లాటెక్స్ అనే పదార్థం ఉంటుంది, అది గర్భధారణ సమయంలో కొంత ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది.. కాబట్టి వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని అంటున్నారు.
అలాగే అలర్జీ ఉన్నవారు, ముఖ్యంగా లాటెక్స్ అలర్జీ ఉన్నవారు బొప్పాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలని రక్తం పలుచబడే మందులు వాడుతున్నవారు లేదా ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సైతం ఈ పండు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు మధుమేహం ఉన్నవారు బొప్పాయి తినకూడదనేది పూర్తిగా నిజం కాదు. కానీ ఏ పండైనా పరిమిత మోతాదులోనే తీసుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా బొప్పాయిని జ్యూస్‌గా కాకుండా.. పండుగా తినడం వల్ల ఫైబర్ లభిస్తుంది. ఇక కిడ్నీలు సరిగ్గా పనిచేయని వారు కూడా ఈ పండు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బొప్పాయిలో పొటాషియం ఉంటుంది. కిడ్నీ వ్యాధి తీవ్రతను బట్టి పొటాషియం పరిమితి అవసరం కావచ్చు. అలాగే బొప్పాయి తిన్న తర్వాత దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు.
ఏది ఏమైనా బొప్పాయి ఆరోగ్యకరమైన పండే. కానీ అది ఏదైనా వ్యాధికి అద్భుతమైన మందు కాదు. కానీ సరైన పరిమాణంలో, మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఈ పండు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












