రాజకీయాలు

22ఏ ముసుగులో అధికారిక దోపిడీ!

రచన: Venu6 నిమిషాల పఠనం

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన "సెక్షన్ 22ఏ" నిబంధన, నేడు రెవెన్యూ అధికారులకు, రాజకీయ నాయకులకు ఒక ప్రైవేట్ ఏటీఎంగా మారిపోయింది. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు, సామాన్యుడి రక్తం తాగుతున్న లైసెన్స్డ్ స్కామ్ అంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సంచలన విషయాలను బయటపెట్టారు.

* అడుగడుగునా అవినీతి.. ప్రతి సంతకానికీ ఒక రేటు!

- ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు

- సామాన్యుడి రక్తం తాగుతున్న లైసెన్స్డ్ స్కామ్ 

- 22ఏ అవినీతి అధికారుల పాలిట కల్పవృక్షంగా మారింది

- ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో ప్రైవేట్ ఆస్తులపై కుట్ర

- ఎన్ఓసీల పేరు మీద జరుగుతున్న దోపిడీకి బాధ్యులెవరు?

స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన "సెక్షన్ 22ఏ" నిబంధన, నేడు రెవెన్యూ అధికారులకు, రాజకీయ నాయకులకు ఒక ప్రైవేట్ ఏటీఎంగా మారిపోయింది. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు, సామాన్యుడి రక్తం తాగుతున్న లైసెన్స్డ్ స్కామ్ అంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సంచలన విషయాలను బయటపెట్టారు. 22ఏ అవినీతి అధికారుల పాలిట కల్పవృక్షంగా మారిందని, నిజమైన ప్రభుత్వ స్థలాలను వదిలేసి, దశాబ్దాలుగా రైతులు, మధ్యతరగతి ప్రజలు అనుభవిస్తున్న ప్రైవేట్ పట్టా భూములను కావాలనే 22ఏ (నిషేధిత ఆస్తుల) జాబితాలో పెడుతున్నారని అన్నారు.

ఇదంతా ఎందుకు?

‘‘నీ భూమి 22ఏలో పడిందా? అయితే ఒక పైరవీకారుడు వస్తాడు.  సార్ కి ఇంత ఇచ్చుకో ఎన్‌ఓసీ తెప్పిస్తా" అని బేరం పెడతాడు. లక్షలు లంచం సమర్పించుకుంటే రాత్రికి రాత్రే ఆ భూమి 22ఏ నుంచి బయటకు వస్తుంది’’ అని జరుగుతున్న చీకటి బాగోతాన్ని దాసోజు వివరించారు. డబ్బులు ఇవ్వలేని సామాన్యుడు మాత్రం ఏళ్ల తరబడి తహసీల్దార్, కలెక్టరేట్ల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలని, ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో లక్షలాదిమంది రైతులు, మధ్యతరగతి కుటుంబాలు, విశ్రాంత ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు తాము కష్టపడి కొనుగోలు చేసిన ప్రైవేట్ పట్టా భూములు నిషేధిత జాబితాలో చిక్కుకుని తీవ్ర రోదనలో ఉన్నారని వివరించారు. భూమి 22ఏలో పడిందంటే చట్టబద్ధంగా కొన్న భూమి ఉన్నా అమ్మలేరు, కొనలేరు, రిజిస్ట్రేషన్ చేయలేరు, బ్యాంకు రుణాలు పొందలేరు అని తెలిపారు.

ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో ప్రైవేట్ ఆస్తులపై కుట్ర

22ఏ నిబంధన ఉద్దేశం ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడడమే. కానీ రికార్డులను సరిగా పరిశీలించకుండా ప్రైవేట్ పట్టా భూములను గుడ్డిగానో లేక అవినీతి కోసమో నిషేధిత జాబితాలో చేర్చడం పరిపాలనా వైఫల్యం కాదా అని శ్రవణ్ నిలదీశారు. కార్యాలయాల చుట్టూ తిరగలేక, అవినీతి అధికారులను మెప్పించలేక, లాయర్లకు భారీగా ఫీజులు చెల్లించలేక సామాన్యుడు నలిగిపోతున్నాడని తెలిపారు. రైతుకు భూమే ప్రాణాధారం. పంట నష్టం వచ్చినా, పిల్లల పెళ్లిళ్లు/చదువులు ఉన్నా భూమి అమ్ముకుందామంటే 22ఏ అడ్డుగోడగా మారింది. అప్పులు తీర్చే మార్గం లేక, పెట్టుబడులు దొరక్క రైతాంగం ఆర్థికంగా కుప్పకూలుతోంది. ఇక, ఉద్యోగ జీవితమంతా పొదుపు చేసి సొంతింటి కోసం ప్లాట్ కొంటే తీరా రిజిస్ట్రేషన్ సమయంలో అది 22ఏలో ఉందని తెలిసి ఆశలు ఆవిరవుతున్నాయి. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎన్ఓసీ రాక నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వివరించారు.

డిజిటల్ తెలంగాణలో పారదర్శకత ఎక్కడ?

ఒక్క ఎన్ఓసీ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి రావడం ఏంటని దాసోజు నిలదీశారు. అప్లికేషన్ ఏ దశలో ఉందో ఆన్‌లైన్ ట్రాకింగ్ ఉండాలి. జాప్యానికి కారణమైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. కేవలం బదిలీలతో సరిపెట్టకుండా జవాబుదారీతనం పెంచాలి. కానీ అవేవీ జరగడం లేదని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజల తరఫున కొన్ని విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 22ఏ జాబితాపై ప్రత్యేక సమీక్ష చేపట్టాలని, ప్రైవేట్ పట్టా భూములను వెంటనే నిషేధిత జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్ఓసీ జారీకి గరిష్టంగా 30 రోజుల కాలపరిమితి విధించాలని, ప్రతి జిల్లాలో ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్ఓసీ పేరుమీద కొనసాగుతున్న అవినీతి, దోపిడీలను నియంత్రించి, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షణకై, ఎన్ఓసీల పేరు మీద జరుగుతున్న దోపిడీ వ్యవస్థను అరికట్టే రాజ్యాంగబద్ధమైన బాధ్యతను రేవంత్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

#Telangana#BRS Dasoju Sravan#Official plunder#Section 22A
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి