- ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేరుస్తుంటే మంత్రికి తెలియదా?
- మీరు నిజాయితీపరులు అయితే బాధ్యతగా వ్యవహరించి రాజీనామా చేయాలి
- ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలను తిట్టడం తప్ప ఏం తెలుసు?
- తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆగ్రహం
స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్
మూడు నెలల నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేరిస్తే మంత్రికి తెలియకుండా జరుగుతుందా అని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రశ్నించింది. మానవత్వం ఉంటే, విలువలు ఉంటే, మీరు నిజాయితీపరులు అయితే, బాధ్యతగా వ్యవహరిస్తే ముందుగా రాజనామా చేయాలని డిమాండ్ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలు, లక్షల ఇండ్లు, లక్షల కొలది ప్లాట్లు, ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితాలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్ చేర్చిందని మండిపడింది. ‘‘రిజిస్ట్రేషన్ కావడం లేదు. నీకేమో తెలివి లేదాయే. తెలుసుకునే సమయం లేదా. ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలను తిట్టడం తప్ప రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు.
ఏ విధమైన పాలన జరుగుతోంది. తెలంగాణలో ఎవరికోసం పాలన జరుగుతోంది. ప్రైవేట్ ఆస్తులను మూడు నెలల క్రితం నిషేధిత జాబితాలో చేరిస్తే రెవెన్యూ మంత్రిగా ఉన్న మీరు, మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు. సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకునే శక్తి మీకున్నదా? ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
మరోవైపు, తెలంగాణ రియల్టర్స్ స్టేట్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ 29 జిల్లాల్లో ఉన్న తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులకు తన సందేశాన్ని పంపారు. ‘‘మీ జిల్లాల్లో ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి ఉంటే గ్రామాల వారీగా డేటాను సేకరించి సంబంధిత కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. పూర్తి వివరాల కోసం అవసరమైనప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు’’ అని తెలిపారు.












