పవిత్ర అమర్‌నాథ్ క్షేత్రానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే భక్తుల సంఖ్య సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. జులై 3న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక పయనంలో, కేవలం 24 రోజుల్లోనే అంటే జులై 26 నాటికి 4.14 లక్షల మందికి పైగా భక్తులు మంచులింగాన్ని దర్శించుకుని పునీతులయ్యారు. ఈ విషయాన్ని శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు ఛైర్మన్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ సందర్యాభంగా త్ర ప్రశాంతంగా సాగడానికి సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం జమ్మూలోని భగవతి నగర్ యాత్రీ నివాస్ నుంచి 4,474 మందితో కూడిన మరొక భక్తుల బృందం బల్తాల్ బేస్ క్యాంపునకు ఉత్సాహంగా బయల్దేరింది. అయితే, మార్గం పునరుద్ధరణ, నిర్వహణ పనుల నిమిత్తం సంప్రదాయ పహల్గామ్ (నున్‌వాన్) మార్గంలో ప్రయాణాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ యాత్ర రాబోయే ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ శుభదినాన అధికారికంగా ముగియనుంది.
హెలికాప్టర్ సేవల నిలిపివేత
ఈ సారి భద్రతా దృష్ట్యా అధికారులు అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. బేస్ క్యాంపుల చుట్టుపక్కల ప్రాంతాలను 'నో ఫ్లై జోన్'గా ప్రకటించడం వల్ల ఈ ఏడాది హెలికాప్టర్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో భక్తులందరూ ప్రత్యేక భద్రతా బలగాల కాన్వాయ్‌ల నడుమ సురక్షితంగా ప్రయాణిస్తున్నారు. అమర్‌నాథ్ గుహను చేరుకోవడానికి ప్రధానంగా 14 కిలోమీటర్ల స్వల్ప దూరమున్న బల్తాల్ మార్గం, 47 కిలోమీటర్ల సుదీర్ఘమైన పహల్గామ్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
సముద్ర మట్టానికి సుమారు 3,880 మీటర్ల అత్యంత ఎత్తైన ప్రతికూల వాతావరణంలో ఉన్న ఈ దివ్య గుహలో పరమశివుడు సహజసిద్ధంగా మంచులింగ రూపంలో ప్రత్యక్షమవుతాడు. హిమలింగాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు కష్టతరమైన ప్రయాణాన్ని సైతం లెక్కచేయకుండా తరలివస్తున్నారు. ప్రస్తుతం ఆర్మీ, పోలీసు, స్థానిక యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, వైద్యం, అన్నప్రసాద వితరణ సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.












