కులాన్ని కాదని ఏపీ రాజకీయం నడవదా..?
కాపుల చుట్టూ టీడీపీ, వైసీపీ రాజకీయం
కాపుల ఓట్లు ఏ పార్టీవి..?
టీడీపీ నేతలు వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దా..?
ఆంధ్రప్రదేశ్‌లో కులాలని కాదని రాజకీయమే నడవదా..? ఇంకా కమ్మ వర్సెస్ కాపు అన్నట్టే ఏపీ రాజకీయాలు ఉన్నాయా..? ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానం వస్తోంది. కొంత కాలంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య కాపు రాజకీయం నడుస్తోంది. పైకి రెండు పార్టీలు ఈ మాటలతో ఏకీభవించకపోయినా.. జరుగుతోంది మాత్రం అదే. కాపుల ఓట్ల కోసం టీడీపీ, వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయన్నది మాత్రం వాస్తవం. కాపులపై పేటెంట్ మాకంటే మాకే అన్నట్టు వ్యూహాలు పన్నుతున్నాయి. అందుకే రెండు పార్టీల్లోని కాపు నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమం టీడీపీలో కలకలానికి కారణమైంది.
వైసీపీ నేతలతో వేదిక పంచుకుంటే వేటేనా..?
నేతల మధ్య తీవ్రస్థాయి విభేదాలు, వ్యక్తిగత పగలు ఏపీలో కామనే. ఇదే విషయం మరోసారి రుజువైంది. కొద్ది రోజుల కిందటే మరణించిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కూడా హాజరయ్యారు. వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించారు. అంతేకాదు.. రాష్ట్రంలో సుమారు కోటి మందికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గంలో ప్రస్తుతం ఒక రకమైన అలజడి మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. కాపుల హక్కుల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం నీతికి, ప్రాణ త్యాగానికి నిలువుటద్దమని కొనియాడారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కాపు ఉద్యమం పురుడుపోసుకుందని గుర్తు చేశారు బోండా ఉమా. రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్‌ల కోసం ముద్రగడ రాసిన లేఖలపై చర్చించాలని నాడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని కూడా చెప్పారు. అయితే సొంత సామాజికవర్గానికే చెందిన కొందరు నేతలు ముద్రగడపై ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. ఆ కారణంగానే పరిస్థితి చేయిదాటిపోయిందని వ్యాఖ్యానించారు. ముద్రగడ పిలుపుతో గ్రామీణ స్థాయి వరకు కాపులు ఐక్యమయ్యారని, తుని ఘటనతో పాటు ఆ ఉద్యమ తీవ్రత వల్లే 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.
వేదికపైనే అంబటితో ముచ్చట్లు
టీడీపీపై చేసిన ఈ వ్యాఖ్యలు ఒక ఎత్తయితే.. వేదికపై వైసీపీ నేత అంబటి రాంబాబుతో బోండా ఉమా ముచ్చట్లు మరొక ఎత్తు. ఆయనతో చాలాసేపు మాట్లాడుతూ కనిపించారు ఉమా. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైసీపీ నేతలతో కలిసి వేదికలే పంచుకోవద్దని చెబితే.. మీరు చేస్తున్న పనేంటని బోండా ఉమాపై మండిపడ్డారట. వెంటనే ఆయన నుంచి వివరణ తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడును ఆదేశించారు చంద్రబాబు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ పరిణామాలను కాపులు కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు, రాజకీయాలకు ఏం సంబంధం అని కాపు నాయకులు ప్రశ్నిస్తున్నారు.
సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు లేదా సంస్మరణ సభలు జరిగినప్పుడు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నేతలంతా పాల్గొంటుంటారు. ఇక్కడ వ్యక్తులే ముఖ్యం. చనిపోయిన వ్యక్తుల దగ్గర రాజకీయాల ప్రస్తావనే రావద్దు. నేతలంతా కలిసికట్టుగా అంతిమ యాత్రలు, దశదిన కర్మల్లో పాల్గొనడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. కానీ, ఏపీలో ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయేలా ఉంది. పుట్టుకైనా, చావైనా రాజకీయమే ముఖ్యం అన్నట్టుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలపై అన్ని పార్టీల్లోని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












