Harish Rao: రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీమంత్రి హరీశ్ రావు. కొత్త ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లు ఎత్తిపోయడం చేతకాదని విమర్శించారు. కానీ, ఎల్ నినో పేరు చెప్పి ప్రజలను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లున్నా ఎత్తిపోసే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రాజెక్టులకు నీటి విడుదలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు హరీశ్ రావు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ లో మాజీమంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
''శ్రీశైలం నీటిలో ఏపీ వాడింది ఎంత? తెలంగాణ వాడింది ఎంత? కల్వకుర్తి మోటర్లు ఎన్ని రోజులు నడిపారు, ఎన్ని గంటలు నడిపారు దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తే మీ చేతకానితనం బయటపడుతుంది. ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా అన్నది ప్రజలకు అర్థమవుతుంది. నీళ్లు వచ్చింది ఎప్పుడు, ఆన్ చేసిన మోటర్లు ఎన్ని, నడిపింది ఎన్ని గంటలు, నడిపింది ఎన్ని రోజులు.. ఇటు కల్వకుర్తి బయటపెట్టు, అటు దేవాదుల బయటపెట్టు. రాష్ట్ర ప్రజలకు స్పష్టమవుతుంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని.
మేము ఆధారాలతో చెబుతున్నాం. ఇది ప్రభుత్వ వైఫల్యంతో వచ్చిన కరువు తప్ప కాలంతో వచ్చింది కాదు. పక్క రాష్ట్రంలో ఎందుకు క్రాప్ హాలీడే లేదు? తెలంగాణలోనే ఎందుకుంది? మీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కల్వకుర్తి కానీ దేవాదుల కానీ వైట్ పేపర్ రిలీజ్ చేయాని డిమాండ్ చేస్తున్నాం. నీళ్లు ఎత్తగలిగే అవకాశం ఉన్నా, రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పినా ప్రభుత్వం వినిపించుకోలేదు. కేసీఆర్ కి మంచి పేరు వస్తుందని, రాజకీయ కారణాలతో కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటర్లు ఆన్ చేయలేదు సీఎం రేవంత్. తెలంగాణకు లేని కరువు రుద్దింది ఈ కాంగ్రెస్ పార్టీ'' అంటూ నిప్పులు చెరిగారు హరీశ్ రావు.
''నాడు కేసీఆర్ ఆదేశాలతో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 42వ రోజునే మహారాష్ట్రకు వెళ్లాం. ఆనాటి ప్రభుత్వంతో మాట్లాడి 152 మీటర్లకు ఒప్పుకోండి అని చర్చలు జరిపాము. ఆ తర్వాత కూడా పలు మార్లు మహారాష్ట్ర ప్రభుత్వంతో మేము చిత్తశుద్ధితో చర్చలు జరిపాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 1054 రోజుల తర్వాత తొలిసారి మహారాష్ట్రకు వెళ్లి చర్చలు జరిపింది. రాష్ట్రం మీద మీకున్న నిజాయితీకి ఇదే నిదర్శనం.
నాడు ఏడేళ్లు, నేడు మూడేళ్లు కాలయాపన చేసింది మీరే. 2007లో ప్రాణహిత చేవెళ్ల స్టార్ట్ అయ్యింది. 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా? మహాష్ట్ర, తెలంగాణ, ఢిల్లీలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మూడు చోట్ల 8ఏళ్లు అధికారంలో ఉన్నా ఎందుకు 152 మీటర్లకు ఒప్పించలేకపోయారు? పదేళ్లు కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంత చేసి.. మహారాష్ట్ర ప్రభుత్వంతో మేము చర్చలు జరపలేదని అవాస్తవాలు మాట్లాడుతున్నారు'' అని రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు హరీశ్ రావు.


