Vijay - Rashmika: సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారాలపై విజయ్ టీమ్ సీరియస్ అయింది. లేనిపోని కట్టుకథలు అల్లుతూ ఆన్‌లైన్‌లో అసత్యాలు వ్యాప్తి చేస్తున్న వారి ఆగడాలకు చెక్ పెట్టేందుకు నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ డీసీపీని కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
గతంలో వచ్చిన ‘కాఫీ విత్ కరణ్’ షోలో విజయ్, రష్మిక మాట్లాడిన మాటలను కొందరు కావాలనే కట్ చేసి, వక్రీకరిస్తూ నెట్టింట ఫేక్ ప్రచారం మొదలుపెట్టారని టీమ్ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఆ పాత కామెంట్లను అడ్డం పెట్టుకుని తప్పుడు పోస్టులు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.
కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా.. ఈ ఫేక్ పోస్టులు పెట్టిన సోషల్ మీడియా అకౌంట్ల లింకులు, వైరల్ చేసిన స్క్రీన్‌షాట్లు, ఇతర కీలక ఆధారాలన్నింటినీ డీసీపీకి అందజేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తప్పుడు పోస్టులతో పరువు తీయాలని చూస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.


