TG: నీరు, అడవి, నేల కోసం నిజాం సర్కార్‌పై పోరాడి ప్రాణాలర్పించిన ఆదివాసీల దేవుడు కొమురం భీమ్ 86వ వర్ధంతి సభ జోడేఘాట్‌లో జరిగింది. తుడుం దెబ్బ నాయకులతో పాటు పలువురు ప్రజాసంఘాల నేతలు అక్కడ భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న 8 లక్షల మంది అర్హులైన పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. "ఒకపక్క ఆదివాసీల ఆత్మగౌరవం అంటూ గొప్పలు చెబుతూనే.. మరోపక్క అడవుల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులను ఫారెస్ట్ ఆఫీసర్లు వేధిస్తున్నారు. ఈ వేధింపులు వెంటనే ఆపాలి. ఆదివాసీల గొంతు నొక్కేలా ఉన్న 49 నంబర్ జీవోను వెంటనే రద్దు చేయాలి" అని డిమాండ్ చేశారు.
రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్, పీసా చట్టం ద్వారా ఆదివాసీ గూడేల్లో వారే స్వయంగా పాలన చేసుకునే హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా గిరిజన పల్లెలకు సరైన రోడ్లు, తాగునీరు, ఆస్పత్రులు, బడులు కల్పించకపోతే భీమ్ స్ఫూర్తితో మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మావోయిస్ట్ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాదరావు (చంద్రన్న), శంకరన్న, జన తెలంగాణ పార్టీ నేత బాల్నే అజయ్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోపీచంద్, నేతలు గంట సత్యం, అర్కా శేషారావు, రైతు సంఘం నేత మల్లన్న పాల్గొన్నారు.


