తెలంగాణ

తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపు.. సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం

రచన: NK•••6 నిమిషాల పఠనం

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం అంశంలో ముందడుగు పడింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ నిర్వహించిన సమావేశం సానుకూలంగా సాగింది.

Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం అంశంలో ముందడుగు పడింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ నిర్వహించిన సమావేశం సానుకూలంగా సాగింది. బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలన్న తెలంగాణ విజ్ఞప్తిని పున:పరిశీలించేందుకు సిద్ధమని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. అయితే మహారాష్ట్రకు, తమ ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు.

తెలంగాణకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో సమావేశమైంది. ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ, మహారాష్ట్రల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గ్రావిటీ ద్వారా నీటి తరలింపు

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ఈ సమావేశంలో కీలకమైన చర్చలు జరిగాయి. బ్యారేజీ ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై సమగ్రంగా చర్చించారు. గ్రావిటీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు తాగు, సాగు నీటిని తరలించేందుకు 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం అవసరం అని సీఎం రేవంత్.. ఫడ్నవీస్ కు వివరించారు.

ఎత్తు పెంపుపై అధ్యయనానికి కమిటీ

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన ఈ చర్చల్లో.. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ ఎత్తు పెంపుపై అధ్యయనానికి అధికారుల కమిటీ ఏర్పాటునకు నిర్ణయం జరిగింది. రెండు రాష్ట్రాల నీటి పారుదల ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటునకు మహారాష్ట్ర సీఎం ప్రతిపాదన చేశారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, సాంకేతిక అంశాలపై అధ్యయనం తర్వాత తదుపరి కార్యాచరణ, ప్రణాళికకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని నిర్ణయించారు.

పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధం

148 మీటర్ల ఎత్తుతోనే బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణ ప్రాంత తాగు, సాగు నీటి అవసరాలు పూర్తి స్థాయిలో తీరవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. 152 మీటర్ల ఎత్తు బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీతో నీటిని తరలించేందుకు వీలుంటుందన్నారు. ఇక మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం పూర్తి పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయం ముఖ్యమైన అంశం అని, అందుకే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజేశారు.

అభివృద్ధిలో వెనుకబడిన ఆదిలాబాద్

సమావేశం ప్రారంభంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ద్వారా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని మహారాష్ట్ర ప్రతినిధి బృందం దృష్టికి తీసుకెళ్లారు. సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని వివరించారు. గిరిజనులు, ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. ఆర్థిక అవకాశాలు లేకపోవడం, వెనుకబాటుతనం కారణంగా గతంలో నక్సలిజం వంటి సమస్యలు తలెత్తిన పరిస్థితులను ఆయన తెలియజేశారు.

#Tummidihatti Barrage#Telangana#Maharashtra#Devendra Fadnavis#Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి