ఏపీ

AP: ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా ‘అర్నబ్’.. ఏపీకి హైఅలర్ట్!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

AP: బంగాళాఖాతంలో కదులుతున్న ‘అర్నబ్’ తుపాను గంటగంటకూ మరింత బలాన్ని పెంచుకుంటూ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఇవాళ అర్ధరాత్రి కల్లా ఇది ‘తీవ్ర తుపాను’గా మారనుందని వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.

AP: బంగాళాఖాతంలో కదులుతున్న ‘అర్నబ్’ తుపాను గంటగంటకూ మరింత బలాన్ని పెంచుకుంటూ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఇవాళ అర్ధరాత్రి కల్లా ఇది ‘తీవ్ర తుపాను’గా మారనుందని వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. అక్కడితో ఆగకుండా, మంగళవారం నాటికి ఏకంగా ‘అతి తీవ్ర తుపాను’గా రూపాంతరం చెంది తీరంపై విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం ఉదయానికల్లా బాపట్ల - విశాఖపట్నం మధ్య, ముఖ్యంగా యానాం సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది.

తీరం దాటే సమయంలో 140 కి.మీ వేగంతో గాలులు

తుపాను తీవ్ర రూపం దాల్చనున్న నేపథ్యంలో కోస్తాంధ్రలో వాతావరణం భీకరంగా మారనుంది. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతకంటే ముందుగానే, అంటే మంగళవారం నుంచే తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు మొదలవుతాయన్నారు. సముద్రం విపరీతంగా అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులెవరూ పొరపాటున కూడా వేటకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు..

తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తనున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. భారీ పెనుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున రోడ్ల పక్కన ఉండే భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల కింద, పెద్ద చెట్ల కింద ఎవరూ ఉండొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. శిథిలావస్థకు చేరిన పాత భవనాల్లో ఉంటున్న ప్రజలు వెంటనే సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్లు ఇవే

ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రభావిత జిల్లాల్లో ఇప్పటికే 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలను మోహరించింది. ఏ క్షణంలోనైనా సాయం కోసం ప్రజలు సంప్రదించేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను 112, 1070, 18004250101 అందుబాటులో ఉంచారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అధికారులు ఇచ్చే ముందస్తు సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది.

#Andhra Pradesh#Andhra Pradesh News#AP News#AP Latest News#AP Breaking News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి