తెలంగాణ

నేను చచ్చిపోతేనే.. జడ్చర్లకు నిధులు ఇస్తారంటే చావడానికైనా సిద్ధమే- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రచన: NK•••7 నిమిషాల పఠనం

అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని అనిరుధ్ రెడ్డి అన్నారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తే మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Anirudh Reddy: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారారు. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తుంటారు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఆయన తీవ్ర విమర్శలు చేస్తుంటారు. తన నియోజకవర్గానికి సంబంధించిన నిధులు, పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని గతంలో పలుమార్లు అనిరుధ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై వివక్ష

మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు ఇస్తున్నారని, ఎమ్మెల్యేల నియోజకవర్గాలను అసలు పట్టించుకోవడం లేదని అనిరుధ్ రెడ్డి గతంలో పలుమార్లు ఆరోపించారు. తమ నియోజకవర్గాలపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా నిధులకు సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెంచారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.

చావడానికైనా సిద్ధమే..

నేను చచ్చిపోతేనే జడ్చర్లకు నిధులు ఇస్తారంటే చావడానికైనా సిద్ధమే అని అనిరుధ్ రెడ్డి అన్నారు. రూ.40 కోట్లు విలువనా? లేదా నా ప్రాణం విలువనా? అనేది ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. తన నియోజకవర్గంలో రోడ్లు పూర్తి చేయకుంటే 30వేల మందితో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా అని రేవంత్ సర్కార్ ను ఆయన హెచ్చరించారు. జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు మంజూరు చేస్తామని మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నా చావుతోనే స్పందిస్తారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రభుత్వం మనుగడ

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని అనిరుధ్ రెడ్డి అన్నారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తే మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జడ్చర్ల నియోజకవర్గానికి నిధుల కోసం 30వేల మందితో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. ఒకవేళ తాను చనిపోతేనే జడ్చర్లకు నిధులు ఇస్తారు అంటే.. ఆ ఆమరణ నిరాహార దీక్షలో తాను చనిపోతానని, ఆ తర్వాతే నిధులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు అనిరుధ్ రెడ్డి. రైతుల కోసం ఎంతటి పోరాటికైనా సిద్ధమన్న ఆయన.. పార్టీలకు అతీతంగా అందరూ తనకు మద్దతు తెలపాలని కోరారు.

ఎవరికీ తలవంచను, భయపడను

''మంత్రుల నియోజకవర్గాలకు నిధులు వస్తున్నాయి. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు బిల్లులు రావడం లేదు, నిధులు కూడా ఇవ్వడం లేదు. ఇది నేను కొట్లాడాల్సిన విషయమే. మీ కోసం, మన కోసం, మన నియోజకవర్గం కోసం. నేను ఎవరికీ తలవంచను. ఎవరికీ భయపడను. కావాలంటే రాజకీయం వదులుకుంటాను. కానీ, భయపడేది లేది. జడ్చర్ల నియోజకవర్గంలో 30వేల మందితో దీక్షలో కూర్చుంటా. చనిపోయే వరకు దీక్షలో కూర్చుంటాను.

జడ్చర్ల నిధుల కోసం 30వేలమందితో ఆమరణ నిరాహార దీక్ష

నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వాల్సిందే. రోడ్లు పూర్తి చేయాల్సిందే. అనిరుధ్ రెడ్డి చచ్చిపోతేనే జడ్చర్లకు నిధులు ఇస్తాము అంటే ఆ ఆమరణ నిరాహార దీక్షలో నేను చచ్చిపోతాను. దాని తర్వాత నిధులు ఇవ్వండి. ఒక ఆర్ అండ్ బీ కాంట్రాక్టర్ నాగర్ కర్నూల్ లో చనిపోతే 5 కోట్ల రూపాయల బిల్లు రిలీజ్ చేశారు. మరి నా చావుకి 40 కోట్ల విలువనా? లేదంటే నేను బతకాల్సిందా? అనేది మా ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంది'' అని అనిరుధ్ రెడ్డి అన్నారు.

నా నియోజకవర్గానికి నీళ్లు, నిధులు ఇవ్వాల్సిందే

''మనకు రోడ్లు ఇచ్చింది ఎవరు? నా గురువు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయననే అడుగుతున్నా నేను. అన్నా కొబ్బరికాయ కొట్టి పోయావు. భట్టి విక్రమార్క పాదయాత్రకు వస్తే జడ్చర్లలో 32వేల మందితో ఆరోజు నేను సభ చేశా. భట్టి విక్రమార్కని కూడా అడుగుతున్నాం. నా నియోజకవర్గానికి మీరు తొందరగా పెండింగ్ బిల్లులు ఇవ్వండి. లేకుంటే నేను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటా.

చనిపోయినా చనిపోతాను కానీ నిధులు మాత్రం జడ్చర్లకు ఇవ్వాల్సిందే. మన నియోజకవర్గం డెవలప్ కావాల్సిందే. ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి కాలువలు రావాలి, కల్లేపల్లికి నీళ్లు రావాలి, మన గ్రామాలకు నీళ్లు అందాలి. వేరే ప్రాంతాల్లో ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. మన దగ్గర మాత్రం కావడం లేదు. కాబట్టి కొట్లాడైనా సరే మన నియోజకవర్గానికి కాలువలు, నీళ్లు తీసుకొస్తా'' అని అనిరుధ్ రెడ్డి అన్నారు.

#Anirudh Reddy#Jadcherla#Funds#Telangana Government#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి