తెలంగాణ

Power Crisis: ఖాళీ బిల్డింగుల షో.. హైదరాబాద్‌లో కరెంట్ కష్టాలు తప్పవా?

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ జోరు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గచ్చిబౌలి, మాదాపూర్, తెల్లాపూర్, కోకాపేట నుంచి మొదలుకొని నగర శివార్ల దాకా ఎటు చూసినా ఆకాశాన్ని తాకే భారీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి.

Power Crisis : హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ జోరు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గచ్చిబౌలి, మాదాపూర్, తెల్లాపూర్, కోకాపేట నుంచి మొదలుకొని నగర శివార్ల దాకా ఎటు చూసినా ఆకాశాన్ని తాకే భారీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. అయితే, ఈ నిర్మాణాల వెనుక జరుగుతున్న షో చూస్తుంటే.. భవిష్యత్తులో నగర ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పవా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎవరూ చేరని ఖాళీ బిల్డింగుల కోసం రాత్రంతా విచ్చలవిడిగా వందల యూనిట్ల విద్యుత్‌ను తగలబెడుతున్నారు.

సాధారణంగా కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో ప్లాట్లు అమ్ముడుపోవాలన్నా, అటుగా రాకపోకలు సాగించే కస్టమర్లను ఆకర్షించాలన్నా బిల్డర్లు మార్కెటింగ్ హంగులను నమ్ముకుంటున్నారు. అందుకోసం నిర్మాణంలో ఉన్న ఖాళీ భవనాల చుట్టూ, బాల్కనీల్లో, ప్రాంగణాల్లో రాత్రంతా ధగధగా మెరిసిపోయేలా భారీ ఫోకస్ లైట్లు, రంగురంగుల ఎల్‌ఈడీ దీపాలు వెలిగిస్తున్నారు. సెక్యూరిటీ కోసం అక్కడక్కడా కొన్ని లైట్లు వేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఒక్క మనిషి కూడా నివాసం లేని ఆ ఖాళీ కాంక్రీట్ భవనాల కోసం తెల్లవార్లూ వందల సంఖ్యలో విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. కేవలం ప్రచారం, షో కోసం రోజూ వేలాది యూనిట్ల పవర్ బూడిదలో పోసిన పన్నీరవుతోంది.

ఇప్పటికే ఒకపక్క ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా పడక, జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గి హైడల్ పవర్ ఉత్పత్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం పెరిగి డిమాండ్ భారీగా పెరిగితే పరిస్థితి ఏంటనే ఆందోళన సామాన్యుల్లో ఉంది. ఇళ్లలో ఒక లైటు, ఫ్యాన్ ఎక్కువ సేపు వేస్తేనే యూనిట్ బిల్లు తడిసిమోపెడవుతుందని మధ్యతరగతి జనం భయపడుతుంటే.. ఇక్కడ మాత్రం అమ్మకానికి పెట్టిన ఖాళీ బిల్డింగుల డెకరేషన్ కోసం కళ్లముందే ఇంత కరెంట్ వృథా కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఈ తీరు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో నగరంలో పవర్ కోతలు రావడం ఖాయమని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రలేచి.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో అనవసర విద్యుత్ వాడకంపై దృష్టి పెట్టాలి. కేవలం బిజినెస్ హంగుల కోసమే రాత్రంతా కరెంట్‌ను వృథా చేస్తున్న బిల్డర్లపై కఠిన ఆంక్షలు విధించాలి. కనీసం అర్ధరాత్రి దాటిన తర్వాతైనా ఇలాంటి అనవసర డెకరేషన్ లైట్లను ఆపివేసేలా చర్యలు తీసుకోకపోతే.. ఆ ఖాళీ బిల్డింగుల షో వల్ల సామాన్య ప్రజలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు.

#Hyderabad Power Crisis#Hyderabad Electricity Crisis#Hyderabad Power Shortage#Hyderabad Power Cuts#Hyderabad Electricity News#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి