టాప్ న్యూస్

TG : ఫండ్స్ గోవిందా? తెలంగాణ లోకల్ ఎలక్షన్స్ ఇంకెప్పుడో?

రచన: Kumar••8 నిమిషాల పఠనం

తెలంగాణలో ఎంపీటీపీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా పెండింగులోనే ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జీహెచ్ఎంసీ పాలన గడువు ఈ ఏడాది ప్రారంభంలో ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్లు పాలన కొనసాగిస్తున్నారు.

తెలంగాణలో ఎంపీటీపీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా పెండింగులోనే ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జీహెచ్ఎంసీ పాలన గడువు ఈ ఏడాది ప్రారంభంలో ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్లు పాలన కొనసాగిస్తున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.ఇదిలాఉండగా, రాష్ట్రంలో పెండింగులో ఉన్న లోకల్ బాడీ ఎన్నికలు డిసెంబరులో ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

కసరత్తు షురూ!

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న MPTC, ZPTC స్థానాలతో పాటు GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ చివర్లో లేదా 2027 జనవరి తొలి వారంలోగా ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది.

కేంద్రం నిధులపై తీవ్ర ప్రభావం..

గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గాల సమయం ముగిసింది. ప్రజల ద్వారా ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులపై తీవ్ర ప్రభావం పడుతోంది. గ్రామీణ స్థానిక సంస్థలకు గత రెండేళ్లలో సుమారు రూ.600 కోట్ల నిధులు రాకుండా నిలిచిపోయాయి. ఎన్నికలు మరింత ఆలస్యం జరిగితే మరో రూ.300 కోట్లు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉన్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా, 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు గాను 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థలకు రావాల్సిన గ్రాంట్లు రూ.3,000 కోట్లు రాలేదని సమాచారం.

రూ.550 కోట్లు పాయే..

2026 మార్చి 31లోపు మండల, జిల్లా పరిషత్‌లకు నూతనంగా ఎన్నికలైన పాలకవర్గాలు లేకపోవడంతో రూ.550 కోట్ల గ్రాంట్లను కేంద్రం నుంచి తెలంగాణ పొందలేకపోయింది. నిర్ణీత సమయంలోగా ఎన్నికలు నిర్వహించలేకపోయినందున 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.550 కోట్లను తిరిగి పొందడం ఇక కష్టమే అని ప్రచారం జరుగుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని తెలుస్తోంది. పాలకవర్గాల్లో నిధులు లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా మారింది. పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరా, స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు వేతనాలు కూడా నిలిచిపోయినట్టు సమాచారం. కాగా,ఈ నిధులను వినియోగించుకోవడంలో రేవంత్ సర్కార్ వెనుకబడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం లోపమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ పాలకవర్గాలు ముగిసి రెండేండ్లు..

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2019 మే నెలలో జరిగాయి. ఎన్నికైన మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం 2024 జూన్‌లో ముగిసింది.కాగా, 2025 సెప్టెంబర్‌లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడంతో అక్టోబర్ 9న ఎన్నికల ప్రక్రియను నిలిపివేశారు. ఇదిలాఉండగా, 2026 అక్టోబర్ నాటికి పదవీకాలం ముగిసి సుమారు రెండేళ్ల నాలుగు నెలలు. ఇప్పటికీ స్పెషల్ అధికారులే పాలనా బాధ్యతలు చూస్తున్నారు.

జీహెచ్ఎంసీ పదవీకాలం ముగిసి జనవరి వస్తే ఏడాది..

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ ఐదేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 10న ముగిసింది. దీంతో మరుసటి రోజు ప్రత్యేక అధికారిని నియమించారు. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించారు. ఈ మూడు సంస్థలకు ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్‌ నియమించగా.. ఆయనే పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. కాగా, 2026 అక్టోబర్ 26 నాటికి జీహెచ్ఎంసీ పదవీ కాలం ముగిసి సుమారు 8 నెలల 15 రోజులు అయ్యింది. 2027 జనవరి వస్తే నూతన పాలకవర్గం కొలువుదీరక ఏడాది కానుంది.

ఏడాది చివర్లో జరిగేనా?

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పెండింగులో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఈ డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార పార్టీకి చెందిన ఓ నేత హింట్ ఇచ్చారు. ఆయన లీక్ ఇచ్చిన విధంగా ఈ డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడతల వారీగా వస్తాయి.. లేదంటే మళ్లీ కేంద్రం ఇవ్వకపోవచ్చని, దీంతో నష్టపోయేది తెలంగాణ ప్రభుత్వమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

#local body elections#central funds#telangana#politics#GHMC#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి